21-11-2025 07:07:29 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం జెడ్‌పిహెచ్‌ఎస్ తాడూరులో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టులో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తంగలపల్లి మండలం నుండి రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో TG Model School మండపల్లి, ZP/Govt English Medium విభాగంలో జెడ్‌పిహెచ్‌ఎస్ తాడూరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సిలివేరి సంపత్ కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులు మూఢనమ్మకాలను విశ్వసించకూడదని, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆధునిక యుగంలో సైన్స్ ప్రాముఖ్యత మరింత పెరిగిందని, కొత్త విషయాలు నేర్చుకునేందుకు విద్యార్థులు నిరంతరం ప్రయత్నించాలన్నారు. ఈ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లేనిది ఏదీ లేదని, సైన్స్‌ను సద్వినియోగం చేసుకొని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎదగాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఏనుగు రఘుపతిరావు, మండల కోఆర్డినేటర్ బదనపురం రవి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.