24-09-2025 03:19:10 PM
పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద 167 ప్రధాన రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాలకు సొంత భవనం కట్టాలని, లెక్చరర్ల కొరతను తీర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంటల తరబడి రాస్తారోకో కారణంగా కొల్లాపూర్–నాగర్‌కర్నూల్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థులతో చర్చించిన పోలీసులు ఆందోళన విరమించాలని సూచించగా, డిమాండ్లు నెరవేర్చేవరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని బుజ్జగించారు.