01-08-2025 10:26:49 PM
నిబద్ధతతోనే లక్ష్యసాధన సాధ్యం..
వీరవెల్లి శ్రీలత..
గరిడేపల్లి (విజయక్రాంతి): విద్యార్థులు పాఠశాలలో క్రమశిక్షణతో ఇష్టంతో చదువుతూ లక్ష్యం వైపు పహినించినప్పుడే ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చునని మోటివేషనల్ స్పీకర్, ఇన్ఫాక్ట్ నారి సెల్ రీజనల్ డైరెక్టర్ వీరవేల్లి శ్రీలత(Regional Director Veeravelli Srilatha) అన్నారు. మండల పరిధిలోని కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో యువ వికాస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆధునిక సమాజంలో నేటి యువత నిబద్ధతతోనే లక్ష్యసాధన సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తించాలని ఆమె అన్నారు. యువత తమ లక్ష్యాలను సాధించాలంటే ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకొని దానిని క్రమశిక్షణతో అనుసరిస్తూ కష్టపడి చదవాలని సూచించారు.
తాము ఎంచుకున్న ఉన్నతమైన మార్గంలో మంచి ఫలితాలను పొందాలంటే విద్యార్థి దశ నుంచి ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదవాలని తద్వారా లక్ష్యాలను సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. యువత విద్యలో నైపుణ్యతతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థి దిశ నుంచే అవగాహన పెంచుకోవాలని సన్మార్గంలో నడిచి గొప్ప లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరారు. క్రమశిక్షణ, పట్టుదల, శ్రమ, సాధన అంశాలను అనుసరిస్తే యువత సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని ఆమె తెలిపారు. క్లబ్ అధ్యక్షులు లైన్ గుండ్రెడ్డి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ, ఉపాధ్యాయ బృందం, లయన్స్ క్లబ్ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, రామయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.