25-11-2025 12:51:33 PM
జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేత
వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటపూర్ మండలంలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చదువుకున్న నిరుద్యోగులు అయిన కామ అశోక్, ఆగే రాజు, నునవత్ పృథ్వీరాజ్, కామ కృష్ణమూర్తి, ఉప్పునుతుల మహేందర్, చిన్నాల రాజు లు క్రమం తప్పకుండా కూలీలుగా పనిచేస్తూ, గతంలో మేటుగా కూడా సేవలు అందించిన అనుభవం కలిగి ఉన్నారని, అయితే వీరిని పక్కన పెట్టి, అసలు కూలీ పని చేయని, ఉపాధి హామీ పథకం విధివిధానాలు తెలియని వ్యక్తికి సీనియర్ మేటు అవకాశం కల్పించడంతో గ్రామంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అనుభవం లేని వ్యక్తిని సీనియర్ మేటుగా నియమించడం వలన పనుల్లో అవకతవకలకు అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో 80 మంది గ్రామస్తుల సంతకాలతో కూడిన పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీడీవోలకు రాతపూర్వకంగా సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని గ్రామస్థులు తెలిపారు. ఎలాంటి గ్రామసభ నిర్వహించకుండా, తీర్మానం లేకుండా పంచాయతీ కార్యదర్శి సీనియర్ మేటుగా పవన్ కళ్యాణ్ ని నియమించారని వారు ఆరోపించారు. అర్హత, అనుభవం ఉన్న తమకు అవకాశం కల్పించాలని కోరుతూ గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు.