05-07-2025 04:58:02 PM
వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెం. 18004257109 ఏర్పాటు..
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు (విజయక్రాంతి): రానున్న రోజులలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని https://whatsapp.com/channel/0029Vb66lEM1noyxmpDiLh0v జిల్లా ప్రజలు, జిల్లా అధికారిక వాట్సాప్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్. 18004257109 ల్యాండ్ లైన్ నెంబర్ లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వర్షాకాలంలో ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. అత్యవసర సేవలకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ సమయంలో వర్షం వస్తుందో తెలీదు కాబట్టి ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగి పొర్లే నది నాలాలు దాటకుండా గ్రామాలలో టాంటాం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొంగిపొర్లే వాగులు,రహదారుల్లో ప్రజలు రవాణా చేయకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని సూచిక బోర్డ్లు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలకు తహసీల్దార్ ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.