05-07-2025 10:16:42 PM
అభివృద్ధి గురించి పట్టించుకోని స్థానిక బీఆర్ఎస్ నేతలు..
తప్పిదాలపై ప్రశ్నిస్తే చిల్లర మాటలు మాట్లాడతారా..
విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు..
గజ్వేల్: గజ్వేల్ బీఆర్ఎస్ నాయకుల అసమర్థత వల్లే గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్(BJP President Manohar Yadav) అన్నారు. శనివారం ఆయన గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలో అసాంఘిక కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారని, కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడడం సరికాదన్నారు. గతంలో సీఎం నియోజకవర్గం అయి ఉండి కూడా గజ్వేల్ లో జరగాల్సిన పనులను సిద్దిపేటకు హరీష్ రావు తరలించుకుపోయిన గజ్వేల్ నాయకులు చేతగాని వారిలానే ఉండిపోయారని ఆరోపించారు. గజ్వేల్ తో పోల్చుకుంటే సిద్దిపేటలో నాలుగు రెట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. గజ్వేల్ నిధులను మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటకు మళ్లించినా కూడా నోర్లు వెళ్ళబెట్టి చూశారని అన్నారు.
స్థానిక నాయకులు కమిషన్లకు కక్కుర్తి పడడంతో యూజీడి పనులు ఆగిపోయాయని, 5 వేల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన మాటలు వట్టి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. కనీసం పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను నిధులు తెచ్చుకొని పూర్తి చేయలేని బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఆరు నెలల్లో ఆరుసార్లు డబుల్ బెడ్ రూమ్ అర్హులు బాధితులు ధర్నా చేసినా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకట్ రెడ్డి, మన్నె శేఖర్, నాయకులు పంజాల రాజు గౌడ్, పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మైస విజయ్, మంద వెంకట్, గడియారం రాజేశ్వరి చారి, రోహిత్, కొక్కొండ అభినాష్ తదితరులు పాల్గొన్నారు.