calender_icon.png 1 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బలూచ్’లో ఆత్మాహుతి దాడి

01-10-2025 12:00:00 AM

  1. క్వెట్టా ఫ్రాంటియర్ కోర్ ఆఫీస్‌లోకి దూసుకొచ్చిన కారు
  2. క్షణాల్లో భారీ పేలుడు.. 13 మంది మృతి
  3.   30 మందికిపైగా గాయాలు
  4. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 30: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళ వారం ఉదయం ఆత్మాహుతి దాడి జరిగింది. క్వెట్టా పట్టణంలోని పారామిలిటరీ ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం వద్దకు సంభవించిన ఈ పేలుడు ధాటికి 13 మంది మృతిచెందగా, 32 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మృతుల్లో ఇద్దరు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కాగా, మిగిలిన వారంతా సాధారణ పౌరులు. ఫ్రాంటియర్ కోర్‌లోని పారామిలటరీ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ ఓ కారు దూసుకువచ్చింది.

తర్వాత క్షణాల్లోనే బ్లాస్టింగ్ సంభవించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొందరు వ్యక్తులు ఆ ప్రాంతంలో కాల్పులు సైతం జరిపినట్లు దృశ్యాల్లో కనిపించింది. భారీ పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతంలోని భవనాల కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి.

బ్లాస్టింగ్ నేపథ్యంలో బలూచిస్థాన్ వైద్యారోగ్యశాఖ మంత్రి బఖ్త్ మహమ్మద్ ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పేలుడు ఘటనను పాకిస్థాన్ అధ్య క్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్టి ఖండించారు. కొందరు తీవ్రవాదులు భారతదేశ అజెండాను మోస్తూ, ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే.. ఆ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.

కాగా, ఘటనలో మృతుల సంఖ్య పెరగవచ్చని అక్కడి యంత్రాంగం వెల్లడిస్తున్నది. సెప్టెంబర్ ఆరంభంలో క్వెట్టా ప్రాం తంలో బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి సంద ర్భంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనలో 11 మంది మరణించగా, సుమారు 18 మంది గాయపడ్డారు. ఆ ఘటన మరువకముందే మరో పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం రేపింది. 

దాడి వెనుక కారణాలు..

బలూచిస్థాన్ ప్రాంతంలో పుష్కలంగా చమురు, గ్యాస్, రాగి వనరులు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ప్రాంతం పాకిస్థాన్‌లోనే అత్యంత పేద ప్రాంతం. సహజ వనరులతో పాక్ ప్రభుత్వం ఆదాయం పొందుతూ, తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడం లేదని దశాబ్దాల నుంచి బలూచ్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇక్కడ సాయుధ గ్రూప్‌లు పుట్టుకొచ్చాయి. స్వతంత్ర బలూచ్ సాధన కోసం ఉద్యమిస్తున్నాయి.

వీటిలో బ లూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ప్రధానమైనవి. ఆ సాయు ధ గ్రూప్‌లకు, పాక్ సైన్యానికి మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే కోవలో తాజాగా క్వెట్టా పణంలోనూ సాయుధ గ్రూప్‌లు బ్లాస్టింగ్‌కు పాల్పడి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు ప్రసారమవుతున్నాయి.