calender_icon.png 1 October, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన వర్షాకాలం

01-10-2025 12:00:00 AM

  1. అయినా.. ప్రభావం మరో రెండు నెలలు
  2. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఆలస్యం
  3. దేశంలో సాధారణం కంటే 8శాతం అధిక వర్షపాతం
  4. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇతర వాతావరణ పరిస్థితులే కారణం

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 30:  నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత దేశంలో వానకాలం ప్రారంభమవుతుంది. ఫలితంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విస్తారమైన వర్షాలు కురుస్తాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది దేశ వార్షిక సాధారణ వర్షపాతం కంటే, ఈసారి 8శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. మంగళవారంతో అధికారికంగా వానకాలం ముగిసినప్పటికీ, ఆ ప్రభావం మరో రెండునెలల పాటు ఉంటుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది.

అక్టోబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే, వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని కింది దిగువ భూభాగాలతో పాటు ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.

తూర్పు, ఈశాన్య ప్రాంతంలో మాత్రం వర్షపాతం లోటు ఉన్నట్లు స్పష్టం చేశారు. రుతుపవనాల ప్రభావం లేని తూర్పు, ఈశాన్య భారతంలో  వార్షిక సాధారణ సగటు వర్షపాతం 1,367.3 మి.మీ కాగా, 1089.9 మి.మీ మాత్రమే నమోదైందని, ఇది సాధారణం కంటే 20 శాతం తక్కువని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంత తక్కువ వర్షపాతం నమోదవడం 1901 తర్వాత మొదటిసారి. అలాగే బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలోనూ వర్షపాత లోటు ఉందని, వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే 27.3 శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు.