20-11-2025 05:23:03 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీ శ్రీగిరి శ్రీనివాస్ 72వ సహకార వారోత్సవాల సందర్భంగా గురువారం ఉత్తమ ఛైర్మన్ అవార్డును తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్, నాప్స్ కాబు చైర్మన్ కొండూరి రవీందర్ రావు చేతులమీదుగా అందుకున్నారు. ఈ అవార్డును తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారు గన్ ఫౌండ్రి కార్యాలయంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గా శ్రీగిరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సంఘంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటి వివరాలను వివరించారు. సంఘం సభ్యులు 2103 నుండి 3530 మందికి పెరిగారు. ఎస్ఏఓ లోన్స్ 4 కోట్లు 11 లక్షల నుండి 13 కోట్లకు పెరిగాయి. ఎల్టి లోన్స్ 3 కోట్లు 65 లక్షల నుండి 28 కోట్లకు పెరిగాయి. గోదాములు ఒకటి మాత్రమే ఉండగా, ఇప్పుడు 4 గోదాములు నిర్మించబడ్డాయి.
షాపింగ్ కాంప్లెక్స్‌లో 13 గదులు నిర్మించారు. పెట్రోల్ బంక్ నిర్మాణం పూర్తి చేశారు. సూపర్ మార్కెట్ వ్యాపారం ప్రారంభించారు. ఐఎస్ఐ వాటర్ ప్లాంట్ వ్యాపారం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా 6% డివిడెండ్ రూపంలో మొత్తం 75 లక్షలు సంఘ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. సిబ్బంది సంఖ్య 3 నుండి 13 మందికి పెరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 3 నుండి 10కి విస్తరించబడ్డాయన్నారు. సభ్యుల సహకారం, సంఘం పట్ల ఉన్న విశ్వాసం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఈ అవార్డు మొత్తం సంఘానికి లభించిన గౌరవం అన్నారు. సంఘ అభివృద్ధికి సహకరించిన పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణ రావుకి, కెడీసీసీబీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు కి, సహకార శాఖ అధికారులకు, బ్యాంక్ అధికారులు, సంఘ పాలక వర్గ సభ్యులకు, సిబ్బందికి, రైతులకు శ్రీగిరి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.