20-11-2025 07:03:53 PM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను వేగవంతముగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో అన్ని మండలాల ఎంపీడీఓ లు, మున్సిపల్ కమీషనర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారిగా పనుల పురోగతిని అడిగి తెలుసుకొని వందశాతం ఇంటి నిర్మాణ పనుల లక్ష్యాలను చేరుకోవాలని, ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ దశలలో ఉన్న వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
అవసరమైన ఇసుక అందుబాటులో వచ్చినందున పనులను వేగవంతం చేసి జిల్లాను రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్ లో నిలుపాలన్నారు. గద్వాల నియోజకవర్గంలో కొత్తగా 300 మంది లబ్ధిదారులకు ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ అందించడం జరిగిందని, గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో రాకముందే మార్కౌట్ పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మంజూరు అయి నిర్మాణాలకు ఆసక్తి చూపని 1197 మంది గృహల స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతిపాదనలు అందజేస్తే అమోదించడం జరుగుతుందన్నారు. ఇట్టి పనులు అన్నింటిని సోమవారం వరకు పూర్తి చేయాలన్నారు. పురోగతిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, హౌసింగ్ పిడి శ్రీనివాస్ రావు, డిపిఓ నాగేంద్రం, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమీషనర్లు, ఏపీవో లు తదితరులు పాల్గొన్నారు.