calender_icon.png 20 November, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య సహకార సంఘాల్లో ముదిరాజులకు బేషరతుగా సభ్యత్వాలు కల్పించాలి

20-11-2025 06:55:30 PM

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఉన్న కొత్త పాత చెరువులలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన 18 ఏళ్లు నిండిన యువకులకు బేషరత్ గా మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వాలు కల్పించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్, అఖిల భారత కోలీ సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొజ్జ నారాయణ ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిస్తూ ఇందుకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నేతలు మాట్లాడుతూ తెలంగాణలోని మిగతా జిల్లాలతో పోలిస్తే తమ జిల్లాల్లో ముదిరాజులకు మత్స్య సహకార సంఘాల్లో సరైన సభ్యత్వాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

పెద్దపెద్ద చెరువులు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు సభ్యత్వాలు లభించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 6 ప్రకారం ప్రతి ముదిరాజులకు చెరువులలో సభ్యత్వం కల్పించాలని మత్స్యకారుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేపల చెరువుల సొసైటీల ఏర్పాటుపై ఆయా గ్రామాల్లో విడీసీ లు పెత్తనం చేయడాన్ని ఎంత మాత్రం సహించేది లేదని దీనిపై జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని కోకాపేట్ లో నూతనంగా నిర్మించే ముదిరాజుల ఆత్మగౌరవ భవనం వద్ద ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులను సన్మానించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మత్స్యకార సంఘాల నాయకులు భారీగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సంఘం జిల్లా అధ్యక్షులు ధార్ష శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చాగంటి భగవాండ్లు, జిల్లా కార్యదర్శి ఈగల పొచ్చన్న, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.