20-11-2025 07:16:47 PM
“బచ్చలమల్లి’ ఫలితం నన్ను నిరాశపర్చలేదు. అది చాలా మంచి సినిమా. తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా మారని క్యారెక్టర్ అది. ఆ సినిమాకు నాకు చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. నేను గర్వపడే సినిమా అది” అంటున్నారు హీరో అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు పొలిమేర మూవీ సిరీస్‌తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను అల్లరి నరేశ్ విలేకరులతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
* ఇది వరంగల్‌లో జరిగే కథ. తెలంగాణ యాస కోసం అజయ్ అనే ఒక వ్యక్తి వచ్చారు. తనతో వర్క్‌షాప్ చేశాను. ఫస్ట్ టైమ్ తెలంగాణ యాస మాట్లాడుతున్నా. చాలా శ్రద్ధ తీసుకున్నా. నేను ప్రతి సినిమాకూ దాదాపు ఒక రోజులో డబ్బింగ్ చెప్పేస్తా. కానీ ఈ సినిమాకు నాలుగు రోజులు పట్టింది. ప్రతి డైలాగ్ చెక్ చేసుకుంటూ యాస సరిగ్గా పలికేలా కేర్ తీసుకున్నా.
* కామాక్షి నాన్న మా నాన్న దగ్గర పనిచేశారు. తను ఇంటర్ చదివేటప్పుడు నా సినిమాల షూటింగ్‌కు వచ్చేది. ఇంతకుముందు నా మారేడుమిల్లి సినిమాలో చేసింది. ఈ సినిమాకు ఒక మిడిల్ క్లాస్, పక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలి. అనిల్‌తో కామాక్షి పొలిమేర సినిమా చేసినప్పటికీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫోటోషూట్ చేశాం. ఈ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే తీసుకున్నాం.
-* నా వరకు కామెడీ చేయడమే కష్టం. కామెడీకి చాలా టైమింగ్ కావాలి. అలాగే సీన్ చేస్తున్నప్పుడు మనం నవ్వకూడదు.. కానీ చూస్తున్న ప్రేక్షకులకు నవ్వు రావాలి. ఆ టైమింగ్ బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. -నాన్న ఎక్కువగా కామెడీ సినిమాలు చేయడంతో నాకు చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. మన ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. వాళ్లందరితో ట్రావెల్ చేయడం నాకు చాలా హెల్ప్ అయింది.
* --నాకు ఒక హారర్ మూవీ, ఒక మూకీ సినిమా చేయాలనుంది. డైలాగ్ లేకుండా నవ్వించాలి. అలాంటి కథ ఎప్పటికైనా ఒకటి చేయాలని ఉంది. -నా దగ్గరికి రెండు మూడు కథలు వచ్చాయి కానీ నచ్చలేదు. ఒక కామెడీ వెబ్‌సిరీస్ ఏదైనా వస్తే బాగుంటుందనుకుంటున్నా. అలాంటిది వస్తే కచ్చితంగా చేస్తా. -కామెడీ రాయడం, తీయడం రెండూ కష్టం. చేయడం కూడా కష్టమే. నవ్వించడం చాలా కష్టమైన కళ. మా నాన్న సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ జనాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అన్ని కూడా సెన్సిటివ్ అయిపోయింది. ఈరోజుల్లో సీమశాస్త్రి తీస్తే అది రిలీజ్ అవ్వదు. (నవ్వుతూ) ఇప్పుడంతా ఆర్గానిక్ కామెడీ. ప్రత్యేకంగా జోకులంటూ వర్కౌట్ అవ్వవు. విన్న జోక్ చెప్పకూడదు. ఏదో కొత్త జోక్ చెప్పాలి.