03-11-2025 12:43:03 AM
239 మందికి ఉచితంగా రక్త పరీక్షలు
కల్వకుర్తి రూరల్, నవంబర్ 02: గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా సుంకిరెడ్డి ఆరోగ్య భరోసా ఐక్యత ఫౌండేషన్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం కల్వకుర్తి మండలం, ఎల్లికట్ట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఉచిత మొబైల్ హెల్త్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరానికి గ్రామంలోని సుమారు 300 మందికి పైగా హాజరు కాగా, వారిలో 239 మందికి సీబీపీ, క్రియేటినిన్, టోటల్ బిలిరుబిన్, ఆర్బీఎస్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి కీలకమైన రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సుంకిరెడ్డి ఆరోగ్య భరోసా కింద ఇప్పటికే ఉచిత అంబులెన్స్ సేవలు, కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇలాంటి మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.
మారుమూల గ్రామంలో ఇంత విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి, రిపోర్టులతో పాటు వైద్యుల సలహాలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లింగమయ్య, సీనియర్ నాయకులు బంగారయ్య, మధు, కృష్ణయ్య శెట్టి, మల్లారెడ్డి, కేశవులు, రవి, నంద్య నాయక్ తదితరులుపాల్గొన్నారు.