బంతితో సన్ రైజ్
- చెన్నైకి షాకిచ్చిన హైదరాబాద్
మరోసారి గెలిపించిన ప్రఫుల్
ఉప్పల్ లాంటి ఫ్లాట్ వికెట్ చేసింది 194 పరుగులే.. ఈ పిచ్ పై 200లోపు టార్గెట్ ను నిలుపుకోవడం కష్టమే అన్న అంచనాల నేపథ్యంలో సన్ రైజర్స్ బౌలర్లు మరోసారి అదరగొట్టారు. గెలుపు దిశగా వెళుతున్న చెన్నై ఎక్స్ ప్రెస్ కు బ్రేక్ వేశారు. ముఖ్యంగా ఎహసాన్ మలింగా స్పెల్ తో ఓడిపోయే మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచింది. అంతేకాదు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
హైదరాబాద్ , ఏప్రిల్ 18 : టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభిన్నిచ్చారు. తొలి వికెట్ కు 75 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో అతనికిదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. అటు హెడ్ 23 , ఇషాన్ కిషన్ (0) వెంటవెంటనే ఔటవడం, కాసేపటికే అభిషేక్ శర్మ 59 ( 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా వెనుదిరగడంతో సన్ రైజర్స్ స్కోరు వేగం కాస్త తగ్గింది. కానీ క్లాసెన్ ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడుతూ స్కోరు పెంచాడు.
ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ కాన్ఫిడెంట్ గా ఇన్నింగ్స్ ఆరంభించింది. సంజూ శాంసన్ (7) విఫలమైనా ఆయుశ్ మాత్రే (30), మాథ్యూ షార్ట్ (34) ధాటిగా ఆడడంతో సాధించాల్సిన రన్ రేట్ మరీ పెరగకుండా ఉండేలా చూసుకున్నారు.
వీరిద్దరి జోరు చూసిన తర్వాత ఈ మ్యాచ్ చెన్నై ఈజీగా గెలిచేలా కనిపించింది. అయితే సన్ రైజర్స్ బౌలర్ ఎహసాన్ మలింగ 3 కీలక వికెట్లతో చెన్నైని దెబ్బకొట్టాడు. అటు మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో విజయం కోసం 18 పరుగులు కావాల్సి ఉండగా ప్రఫుల్ హింగే నోబాల్ వేసినా తర్వాత కట్టడి చేశాడు. ఫలితంగా సన్ రైజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్కోరు బోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 194/9 (అభిషేక్ శర్మ 59, క్లాసెన్ 59, హెడ్ 23 ; ఓవర్టన్ 3/37, అన్షుల్ కాంబోజ్ 3/22, ముకేశ్ చౌదరి 2/21 )
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: 184/8 ( మాత్రే 30, షార్ట్ 34, సర్ఫరాజ్ ఖాన్ 25 ; మలింగ 3/29, నితీశ్ రెడ్డి 2/31 )






