07-11-2025 01:14:22 AM
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన లక్ష మంది ప్రైవేట్ కాలేజీల అధ్యాపకుల సాంత్వన సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సభలను అనుమతించటం లేదని, తాము పెట్టుకున్న దరఖాస్తుని నగర కమిషనర్ కార్యాలయం తిరస్కరించిన ట్లు ఫతి పేర్కొంది.
దీంతో ఈ అంశంపై ఫతి ఈసీ మెంబర్లు గురువారం సాయంత్రం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం శుక్రవారం ఉదయం విచారణ చేపట్టనున్నదని తెలిపారు. ఇదిలా ఉంటే ఎల్బీ స్టేడియంలో అనుమతినివ్వకపోవడంతో సికింద్రాబాద్ స్టేడియం లేదా ఉప్పల్ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలో ఏదోక చోట సభ నిర్వహించేందుకు అనుమతులివ్వాలని ‘ఫతి’ సభ్యులు కోరినా నగర పోలీస్ కమిషనర్ అనుమతులివ్వలేదని వారు పేర్కొన్నారు.
దీంతో బండ్ల గూడలోని అరోరా ఇంజినీరింగ్ క్యాంపస్‌కి అధ్యాపకుల సభ వేదికను మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఈనెల 11న పది లక్షల మంది విద్యా ర్థులతో తలపెట్టిన మహార్యాలీ (సభ కూడా) ఈనెల 15కు వాయిదా వేసినట్లు సభ్యులు ప్రకటించారు. శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపై అధ్యాపకుల సభ ఎక్కడ నిర్వహించాలనేది తెలుస్తుందని పేర్కొన్నారు.
నాలుగో రోజు కాలేజీలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజు కూడా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు బంద్‌ను పాటించాయి. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3నుంచి ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్‌ను పాటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, డీఎడ్, నర్సింగ్, లా, పాలిటెక్నిక్, పారా మెడికల్ వంటి సుమారు 2 వేలకుపైగా కాలేజీలు పూర్తిగా మూసివేసినట్లు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) నేతలు తెలిపారు.
బుధవారం వరకు 9 కాలేజీల్లో బీఫార్మసీ పరీక్షలు జరగ్గా గురువారం నల్లగొండలోని ఓ కాలేజీలో మాత్రమే పరీక్షలు జరిగాయి. మిగతా ఫార్మసీ కాలేజీలు పరీక్షలు బహిష్కరించారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద లేని కాలేజీలు మాత్రమే కొన్ని నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఫీజు బకాయిలిస్తే గానీ కాలేజీల బంద్‌ను విరమించుకోమని ఫతి నేతలు స్పష్టం చేస్తున్నారు.