07-11-2025 01:39:38 AM
-మాగంటి చావుకు కేటీఆరే కారణం..
-హిందూ ఓటర్లు ఏకమవ్వాలి
-జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): “నేను హిందువును. ఓట్ల కోసం టోపీ పెట్టుకుని డ్రామాలు చేయను. టోపీ పెట్టుకునే పరిస్థితే వస్తే నా తల నరుక్కుంటానే తప్ప ఆ పని చేయను” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో ప్రచారంలో భాగం గా గురువారం బోరబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి కేటీఆరే కారణమని, ఆయన తల్లి స్వయంగా ఈ విషయం చెప్పిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే విచారణ జరిపించి, కేటీఆర్‌ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పెద్ద మూర్ఖుడని, ఆయన కొడుకు అంతకంటే మూర్ఖుడని, తండ్రిని పక్కకు నెట్టి సీఎం కుర్చీ ఎక్కాలని కేటీఆర్ చూస్తున్నాడని విమర్శించారు. కల్వకుంట్ల కవితను ఉద్దేశిస్తూ, మీ అన్న, మీ బావ, మీ బాబాయితో జాగ్రత్త. అప్పుడప్పుడు మీ తండ్రి వద్దకు వెళ్లి బాగోగులు చూసుకో అని వ్యాఖ్యానించారు.
రేవంత్ టోపీ డ్రామా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం టోపీ పెట్టుకున్న రేవంత్‌రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు దమ్ముంటే అజారుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదివించాలని, ఒవైసీ సోదరులను భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకెళ్లి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాలన మారినా ప్రజల తలరాత మారలేదని బండి సంజయ్ అన్నారు.
ఏనుగులు తినేటోడు బీఆర్‌ఎస్ పోయి, పీనుగలు పీక్కు తినేటోడు కాంగ్రెస్ వచ్చిండని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగితే, రేవంత్‌రెడ్డి కేవలం రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ కోరారని, ఎవరిని కాపాడటానికి ఈ డ్రామా అని నిలదీశారు. కాంగ్రె స్, బీఆర్‌ఎస్ ఒక్కటే, అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో హిందూ ఓటర్లు ఏకమై తమ సత్తా చూపాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
సభకు పర్మిషన్ రద్దు.. తర్వాత అనుమతి
గురువారం సాయంత్రం బోరబండలో బండి సంజయ్ నిర్వహించిన సభకు పోలీసులు తొలుత అనుమతిని రద్దు చేసి, తర్వా త మళ్లీ ఇచ్చారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ ‘రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా? నేనొస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలా రా సాయంత్రం బోరబండకు తరలిరండి. బేజేపీ దమ్మేందో చూపిద్దాం” అని ఫైర్ అయ్యారు. ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమేంటని ప్ర శ్నించారు. పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా? అని విమర్శించారు. బోర బండలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహించేందుకు తమకు అనుమతులున్నా పోలీసులు అనుమతులివవ్వడంలేదని ఎన్నికల అధికారికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ తర్వా త పోలీసు అధికారులు అనుమతులిచ్చారు.