10 April, 2026 | 9:09 AM

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

15-08-2024 12:39 AM
  1. నియామకాలు చేపట్టకుండానే స్టే ఎలా ఇవ్వాలి?
  2. ఎమ్మెల్సీలను నియమించిన తర్వాత అడగండి
  3. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు, కుర్ర పిటిషన్‌పై ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆగస్టు 14: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ఇప్పటికిప్పుడు గవర్నర్ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ప్రకటిం చింది. గవర్నర్ కోటాలో  ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమెర్ అలీ ఖాన్ నియామకాలతోపాటు ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బాలచంద్రన్ వరలేతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీల నియామకంపై స్టేటస్ కో విధించాలన్న పిటిషనర్ల విన్నపాన్ని తిరస్కరించింది. 

ఎవరికి ఆదేశాలివ్వాలి?

పిటిషనర్ల తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ గవర్నర్ కోటా నియామకాలపై కోర్టులు మొట్టికాయలు వేసినా పదేపదే అదే తీరులో నియామకాలు జరుగుతున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిఫారసులను గవర్నర్ తిరస్కరించగా, కాంగ్రెస్ ప్రభుత్వ సిఫారసు లను ఆమోదించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమిం చరాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ వారినే నియమించాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకోవటం షాక్‌కు గురిచేసిందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ సిఫారసు ల మేరకు మళ్లీ కోదండరాం, అమెర్ అలీఖాన్ నియామకంపై స్టే విధించాలని కోరారు.

ఈ సమయంలో జోక్యం చేసుకొన్న జస్టిస్ విక్రమ్‌నాథ్ వారిని కూడా (ఎమ్మెల్సీలుగా నియామకం అయ్యే రాజకీయ నేతల ను) కోర్టు ముందుకు రానీయం డి... అప్పటివరకు నాలుగు వారాలపాటు ఆగుదాం అని తెలిపారు. అందుకు సిబల్ స్పందిస్తూ ముందుగా స్టేటస్‌కో ఇవ్వాలని కోరారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన విక్రమ్‌నాథ్.. ‘దేనికి స్టేటస్ కో? ఎవరికి ఇవ్వాలి? దేనిపై ఇవ్వాలి? వారు (ప్రభుత్వం, గవర్నర్) ఇంకా ఏమీ చేయలేదు’ అని అన్నారు.

సిబల్ కొనసాగిస్తూ.. బీఆర్‌ఎస్ నేతల ప్రస్తుత కేసు తేలేవరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరారు. ‘గవర్నర్ నియామకాలను హైకోర్టు కొట్టివేసినా.. మళ్లీ వారినే ఎమ్మెల్సీలుగా నియమించే ప్రయత్నం జరుగుతున్నది. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి అంతా మారిపోతుంది. అలా ఎందుకు జరుగనివ్వాలి?’ అని వాదించారు. అం దుకు న్యాయమూర్తి స్పంది స్తూ.. ‘మీరన్నట్టే స్టేటస్ కో కొనసాగించాలని చెపు దాం.. కానీ ఎవరికి చెప్పాలి?’ అని ప్రశ్నించారు. దీంతో గవర్నర్‌కే ఆదేశాలివ్వాలని సిబల్ కోరారు. 

హైకోర్టు తీర్పుపై స్టే

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభు త్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయ ణను ఎమ్మెల్సీలుగా నియమించాలని అప్పటి గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఈ ఆర్టికల్ ప్రకారం సాహిత్యం, విజ్ఞానం, ఆర్ట్, సామాజిక సేవ తదితర రంగాల్లో కృషిచేసిన వారినే ఎమ్మెల్సీలుగా నియమించాలని, కానీ.. ప్రభుత్వం సిఫార సు చేసినవారికి రాజకీయ సంబంధాలున్నాయన్న కారణంతో నాటి గవర్నర్ తమిళిసై ఆ సిఫారసులను 2023 సెప్టెంబర్ 19న తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి, అమెర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని సిఫారసు చేసింది.

ఈ సిఫారసులను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం ఈ ఏడాది జనవరి 27న నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హై కోర్టుకు వెళ్లారు. దీంతో జనవరి 30 కోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చింది. మార్చిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం దాసోజు, కుర్ర నామినేషన్లను తిరస్కరిస్తూ గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. క్యాబినెట్ నిర్ణయాలను గవర్నర్ పా టించాల్సిందేనని పేర్కొన్నది.

కోదండరాం, అమెర్ అలీ నియామకాలను కూడా కొట్టివేసింది. కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాత మళ్లీ పాత అభ్యర్థునే గవర్నర్ కోటా కు ప్రభుత్వం సిఫారసు చేసినట్టు తెలిసింది. అయితే, దాసోజు, కుర్ర నియామకాలను తిరస్కరించటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినప్పటికీ, వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలని హైకోర్టు కోర్టు చెప్పలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతోపాటు హైకోర్టు ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై సుప్రీం ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. చివరకు పిటిషనర్ల అభ్యర్థన మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం ప్రస్తుత కేసు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని ప్రకటించింది.