దిగిపోనున్న జపాన్ ప్రధాని
- వచ్చే నెల నుంచి బాధ్యతలకు దూరం కానున్న జపాన్ పీఎం
- ప్రజా వ్యతిరేకతతోనే నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు
టోక్యో (జపాన్), ఆగస్టు 14: జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిదా కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో తాను ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. టోక్యో లో బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం సరికొత్త వ్యక్తులకు నాయకత్వం అప్పగించాల్సిన అవసరముందని, వచ్చే నెలలో జరిగే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు.
దీంతో ప్రధాని పదవి నుంచి కిషిదా దిగిపోయి మరొకరికి తన పీఠాన్ని అప్పగించనున్నట్లు పరోక్షగా తెలిపారు. కొత్త నాయకుడికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో తమ పార్టీ విధానాలు మారాయని, ఇది ప్రజలకు తెలియాలని సూచించారు. ఈ నేపథ్యంలో తన బాధ్యతలను వేరొకరికి అప్పగించడం చాలా ముఖ్యమని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు.
థాయ్‌లాండ్ ప్రధానిపై వేటు
నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలపై థాయ్‌లాండ్ ప్రధాని స్రెట్టా థావి సిన్‌ను అక్కడి కోర్టు పదవి నుంచి తొలగించి తమ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కొత్త ప్రధాని నియామకానికి పార్లమెంట్ ఆమోదం లభించేవరకు ఆపద్ధర్మ అధినేతగా క్యాబినెట్ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఓ జడ్జీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని క్యాబినెట్ సభ్యుడిగా నియమిం చిన వ్యవహారంలో ప్రధానిపై అక్కడి న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతిపక్ష పార్టీని రద్దు చేయాలని అక్కడి కోర్టు ఆదేశించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. క్యాబినెట్ పునర్వవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను మంత్రి వర్గంలోకి ప్రధాని స్రెట్టా తీసుకున్నారు. కానీ 2008లో లంచం కేసులో పిచిత్ ఆర్నెల్ల జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతానికి పిచిత్ జైలు శిక్ష పూర్తయినప్పటికీ ఈ దేశ అత్యున్నత కోర్టు సదరు సభ్యుడిని నిజాయితీ లేని వ్యక్తిగా ప్రకటిస్తూ తాజా తీర్పునిచ్చింది.




