మావోయిస్టు దంపతుల లొంగుబాటు
హనుమకొండ/కరీంనగర్, జూన్ 14 (విజయక్రాంతి): మావోయిస్టు దంపతులు తిక్క సుస్మిత, మడకం దూల శుక్రవారం వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను కరీంనగర్ సీపీ, వరంగల్ ఇన్‌చార్జ్ కమిషనర్ కమిషనర్ అభిషేక్ మహంతి మీడియాకు వెల్లడించారు. హనుమకొండ మండలం సుదంపల్లికి చెందిన తిక్క సుస్మిత ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. మావోయిస్ట్ సానుభూతి పరుడైన తన తండ్రి తిక్క సుధాకర్ పనితీరుకు ఆకర్షితురాలై 2016లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సమక్షంలో మావోయిస్ట్ పార్టీలో చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూల అలియాస్ దూల ఐదో తరగతి వరకు చదివాడు.
తన అన్న ఐయేత మావోయిస్ట్ పార్టీలో చేరాడని దూల కూడా 2015లో ఏరియా కమిటీ మెంబర్ జోగి ప్రోత్సాహంతో పార్టీలో చేరాడు. పార్టీలో పనిచేస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి 30న పెళ్లి చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో పనిచేసారు. మావోయిస్ట్ సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయిన దూల దంపతులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇన్‌చార్జ్ కమిషనర్ అభిషేక్ మహంతి ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున డీడీని లొంగిపోయిన దంపతులకు అందజేశారు. ఈ సమావేశంలో కాజీపేట ఏసీపీ తిరుమల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






