12-01-2026 03:03:25 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్:(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన బోధనలతో భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శ ప్రాయుడని అన్నారు.
దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి యువతను మేల్కొల్పిన దార్శనికుడు వివేకానందుడు అని కొనియాడారు. ఆయన జీవిత గాధను ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా యువకులు చదవాలని అన్నారు. ఆయన బోధనలను పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిస్తే యువతకు తిరుగు లేదని విజయ రమణారావు అన్నారు. ఆయన చిన్న వయసులోనే కాలంచెల్లి, మన మధ్య లేకపోయినాప్పటికీ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆయన ఆదర్శాలు మాత్రం ఉంటాయన్నారు.
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సామల హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాజేంద్రప్రసాద్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, పల్ల సురేష్ , మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.