calender_icon.png 12 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా చేయడంలోనే నిజమైన సంతృప్తి

12-01-2026 03:00:10 PM

17న రూ. 1200 కోట్ల పనులకు సీఎం చెతుల మీదుగా శంకుస్థాపన

 ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. విగ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవర్ధన్ గౌడ్ సహకారంతో మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని విగ్నేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలు త్వరలో జరగనున్నాయని తెలిపారు. మన మున్సిపల్ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.

మహబూబ్‌నగర్ బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం వల్ల నగర అభివృద్ధికి అవసరమైన నిధులు సులభంగా సమకూరుతున్నాయని, ఈ నెల 17వ తేదీన  ముఖ్యమంత్రి చేత రూ.1200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనున్నట్లు  స్పష్టం చేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత రక్తదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

రక్తదానం చేసిన ప్రతి దాతను ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు భారతదేశ యువతకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆచరణలో పెట్టి, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజాభివృద్ధికి దోహదపడాలని వక్తలు పిలుపునిచ్చారు.  ఈ ఉచిత రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువతతో పాటు కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.

నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై పాల్గొన్నవారు సంతృప్తి వ్యక్తం చేస్తూ విగ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సిజె బెనహర్, సంజీవరెడ్డి, అహ్మద్ ఖాన్, రమేష్ రెడ్డి, గంగిరెడ్డి, టీఎన్జీవో రాజీవ్ రెడ్డి, విగ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.