30-06-2025 12:00:00 AM
స్వేదం అంటని పద్యాలకు
పాదాలుండవు రెక్కలు తప్ప!
మట్టి అంటని పాదాల నుంచి
శ్రమ సౌందర్యాన్ని కల గనలేము!
మట్టికి మహిమలద్దిన పాదాల పవిత్రత
రెక్కల పద్యాలు దర్శించలేవు!
మట్టిపాదాలు స్వేదం చిందని రోజు
ఉదయాస్తమయాలు ఉనికిని కోల్పోతాయి!
రోజూ ఎన్ని అనుభవాలు వైభవాలు
అన్నింటికీ మూలం
శ్రామికుని స్వేద బిందువే!
మార్కెట్ వెల్లువలో కొట్టుకపోయే మనిషికి
కార్మికుని త్యాగశీలతను
మన పద్యమే విప్పాలి!
లోకానికి ప్రాణం పోసే శ్రామికుని నిత్యసేవకు
హారతి పట్టిన చోటనే
మానవత్వానికి చిరునామా!
మనిషి ఊహలను ఒకసారి ఒడగట్టి చూడండి
ఆ పరిమళమంతా శ్రామికుని
స్వేద దరహాసమే!!