6 July, 2026 | 2:44 PM

ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి

11-06-2024 02:28 AM

వానకాలం పరిస్థితులపై మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి) : రానున్న వర్షాలు, వరద పరిస్థితిపై మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ కొత్త కనెక్షన్లు, పాత కనెక్షన్ల వివరాలు తెలుసుకున్నారు.  పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కుంటలు, చెరువులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లలోకి చేరుకునే వరదపై అలర్ట్‌గా ఉండాలని తెలిపారు. 

వర్షాల వల్ల పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. హోటళ్లు, మార్కెట్లు, దుకాణాల్లో నిల్వవస్తువులపై నిఘా ఉంచాలన్నారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే వాటిని తాత్కాలికంగా నిషేధించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించడం, గుంతలు పూడ్చడం, బ్లీచింగ్ చల్లడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా శక్తి పథకం కింద పాఠశాల యూనిఫామ్స్ కుట్టడం దాదాపు పూర్తయిందని, పాఠశాల ప్రారంభంలోపే విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్  శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫ్ఫీయుద్దిన్, ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.