calender_icon.png 29 October, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తులో నిలబడ్డ 'కార్యదర్శి'!

29-10-2025 12:36:52 PM

ఇళ్లలోకి వరద.. అడ్డుగా ఉన్న మట్టిని తానే గడ్డపార పట్టి తొలగించిన సాహసం ప్రజల ప్రశంసలు

చివ్వెంల,విజయక్రాంతి: మొంథా తుపాను కకావికలం! గత రెండు రోజులుగా  కురుస్తున్న పెనుగాలులతో కూడిన కుంభవృష్టి వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అక్కలదేవిగూడెం గ్రామంలో పరిస్థితి మరింత దారుణం. గ్రామం లోని పలు నివాసాల్లోకి నీరు పోటెత్తడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రజల కష్టాన్ని చూసి కదలిక!

ఎవరికి చెప్పుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో అక్కలదేవిగూడెం వాసులు ఉండగా, ఈ విషయం పంచాయతీ కార్యదర్శి మల్లయ్య దృష్టికి వచ్చింది. ఈయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తక్షణమే రంగంలోకి దిగారు. వాన ఆగినా, ఆగకపోయినా... ప్రజల ఇళ్లలోకి వస్తున్న వరద నీటిని అరికట్టేందుకు ఆయన తన అధికారాన్ని పక్కనబెట్టి, మానవత్వాన్ని ముందుంచారు.తానే కూలీగా మారి.. నీటి ప్రవాహానికి అడ్డుగా పేరుకుపోయిన మట్టి దిబ్బను తొలగించేందుకు, కార్యదర్శి మల్లయ్య  పంచాయతీ సిబ్బందితో కలిసి స్వయంగా గడ్డపార పట్టి యుద్ధం చేశారు.అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాళ్లే కాదు, ఆపదలో అండగా నిలబడేవాళ్లే అని మల్లయ్య  చేతల్లో చూపారు. ఈ సాహసోపేతమైన చర్యతో, ఇళ్లలోకి వస్తున్న నీరు మళ్లింది. తక్షణమే స్పందించి, ఎటువంటి జాప్యం లేకుండా అండగా నిలిచిన కార్యదర్శి మల్లయ్య  అక్కలదేవిగూడెం గ్రామస్థులంతా పొగుడుతున్నారు.ఇటువంటి ప్రజా సేవకులు మనకు ఆదర్శం!