24-10-2025 12:19:11 AM
-డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముకేశ్ సహనీ
-ప్రకటించిన మహాగఠ్ బంధన్ కూటమి
-పోస్టర్లలో కనిపించని రాహుల్ గాంధీ ఫొటో
పట్నా, అక్టోబర్ 23: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మహాగఠ్ బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చింది. ‘మా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ అని, డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహనీ’ అని మహాగఠ్ బంధన్ కూట మి గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీహార్ రాజధాని పట్నాలో మీడి యా సమావేశం నిర్వహించారు. ‘మా కూట మి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్. మరి మీ అభ్యర్థి ఎవరు?’ అని ఎన్డీయేకు మహాగఠ్ బం ధన్ సవాల్ విసిరింది.
సీఎం అభ్యర్థితోపాటు ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముకేశ్ సహనీ అని కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ తెలిపారు. అయితే ఈ మీడియా సమావేశం పోస్టర్లలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎంపీ రాహు ల్ గాంధీ ఫొటో కనిపించలేదు. తేజస్వీ యాదవ్ ఫొటో మాత్రమే దర్శనమిచ్చింది. ‘ఇది కూటమి సంయుక్త మీడియా సమావేశమా? కాదా? ఒక్క ఫొటోనే ఉంది. కాంగ్రెస్ రాహుల్‌కు వారి స్థానమేంటో చూపించరా?’ అని బీజేపీ వ్యం గ్యాస్త్రాలను ప్రయోగించింది.
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ 61 స్థానా ల్లో పోటీ చేస్తుండగా ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఐ 9, సీపీఐ (ఎం) ౪స్థానాల్లో తలపడుతున్నాయి. 8 స్థా నాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఆయా స్థానాల్లో మహాగఠ్ బంధన్ కూటమి అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కూటమిలో చీలిక వచ్చిందనే వదంతులు బలంగా వినిపించాయి. అయితే కూటమి పార్టీలు తమలో తాము పోటీ పడతాయా, స యోధ్య కుదుర్చుకుని ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయిస్తాయా అనే చర్చ రసవత్తరంగా నడుస్తోంది.
ఎవరీ ‘వీఐపీ’.. సహనీ?
బీహార్‌లో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వెనుకబడిన వర్గానికి చెందిన ఓ యువ నేత ను మహాగఠ్ బంధన్ కూటమి ప్రకటించి, ఆ సామాజిక వర్గం తమకు ఓటుబ్యాంకుగా మారేలా ఎత్తుగడ వేసింది. దీంతో ఎవరీ సహనీ అని దేశవ్యాప్తంగా ఆయన గురించి ఆరా తీస్తున్నారు. ఆ యువనేతే వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీ(వీఐపీ) వ్యవస్థాపకుడు ముకేశ్ సహనీ. కొన్నేళ్ల క్రితం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన విపక్షం తరఫున మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ముకేశ్ సహనీ దర్భంగాలో ఓ మత్స్యకారు ల కుటుంబంలో 1981లో జన్మించి, 19 సంవత్సరంలో ముంబైకి వెళ్లి సేల్స్‌మ్యాన్‌గా పనిచేశారు.స్టేజ్ డిజైనర్‌గా.. ముకేశ్ సినీవరల్డ్ కంపెనీ స్థాపించి, బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.
నిషాద్(పడవలు నడిపే, జాలర్లు) వర్గానికి చెందిన ఆయన పట్నా, దర్భంగాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ.. తన సామాజిక వర్గం ‘మల్లా కుమారుడు’గా ఎదిగారు. మల్లా.. నిషాద్ వర్గంలో ఉప కులంగా ఉంది. ప్రధాని మోదీ చొరవ తో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన సహనీ.. 2018లో వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీ(వీఐపీ)ని స్థాపించారు. ఆయన పార్టీలో ఒడిదుడుకుల రీత్యా, బీజేపీకి మళ్లీ దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే సహనీకి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చిన మహాగఠ్ బంధన్ కూటమి నిషాద్ వర్గం ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తారనే దీమాలో ఉంది.