24-10-2025 08:49:33 AM
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో(Kurnool District) ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు(Travels Bus Catches Fire) మంటల్లో చిక్కుకుని పలువురు సజీవదహనం అయ్యారు. అత్యవసర ద్వారం పగలగొట్టి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. 12 మందికి స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సును ముందు నుంచి బైకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. బస్సుకు అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రమాదానానికి గురైన బస్సు వేమూరి కావేరి ట్రావెల్స్ గా గుర్తించారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరింది.
ప్రమాదానికి గురైన బస్సు నంబర్ DD01 N9490. అగ్నిప్రమాదం జరగడంతో ఎన్ హెచ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మంటలకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సును ఢీకొన్న బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. బస్సు ఢీకొన్న పల్సర్ బైక్ వివరాలను అధికారులు గుర్తిస్తున్నారు. రాత్రి సూరారంలో ఇద్దరు ప్రయాణికులు గుణసాయి(33), ప్రశాత్(32) ట్రావెల్స్ బస్సు ఎక్కారు. కిటికీలో నుంచి దూకిన గుణసాయి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రశాంత్ ఫోన్ ఎత్తకపోవడంతో మరణించి ఉంటాడని అనునమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి జేఎన్ టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. ముగ్గురిలో ఒకరు సురక్షితం, మరో ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదం నుంచి బయటపడి వారిని సత్యనారాయణ, శ్రీలక్ష్మీ, నవీన్ కుమార్, అఖిల్, హారిక, జష్మిత, అకీర , రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డిగా గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంలో 20 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ క్వామర్, కమిషనర్ పి. విశ్వనాథ్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్యను ఇంకా నిర్ధారించలేదు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, బాధితులకు సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సంరక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఎం. రాంప్రసాద్ రెడ్డి, టిజి భరత్, బిసి జనార్ధన్ రెడ్డి కూడా ఈ సంఘటనపై వివరణాత్మక నివేదికలను కోరారు.