24-10-2025 12:20:53 AM
-రెండు చమురు కంపెనీలపై భారీ ఆంక్షలు
-రష్యా నుంచి భారత్‌కు నిలిచిపోనున్న చమురు సరఫరా?
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్కోకు చెందిన రెండు ప్రధాన చమురు కంపెనీలపై ఆంక్షలు విధించారు. అమెరికా ట్రెజరీ విభాగం ఈ ఆంక్షల వివరాలను అధికారికంగా వెల్లడించింది. రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్, లుకాయిల్ అనే రెండు ప్రధాన చమురు కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించడమే కాకుండా శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేకపోవడం వల్లే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపింది. తమ నిర్ణయం ఆ దేశ చమురు రంగంపై ఒత్తిడి పెంచుతుందని, దీనివల్ల రష్యా ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొం ది.
రష్యాలోని చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించడంతో భారత్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రష్యాతో చమురు కాంట్రా క్టును దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలు పునఃపరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు భారత్‌కు రష్యా చమురు సరఫరా పూర్తిగా సున్నాకు చేరే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చమురు సంస్థలపై ఆంక్షలు విధించడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. ట్రంప్ ఆంక్షలు భారత్‌పై ఏమాత్రం ప్రభావం చూపనున్నాయో పరిశీలిస్తోంది. ఆకస్మాత్తుగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపలేకపోవచ్చని, ఈ సంవత్సరం చివరి నాటికి దశలవారీగా ఇది అమలులోకి వస్తోందని డోనాల్డ్ ట్రంప్ పేర్కొనడాన్ని కూడా భారత్ గమనిస్తోంది.
కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి దేశీయ రిపైనరీలు.. స్పాట్ మార్కెట్‌లో రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీకి రోస్నెఫ్టతో దీర్ఘకాల కాంట్రాక్ట్ ఉంది. ఇప్పు డు ఆంక్షల నేపథ్యంలో ఈ కొనుగోళ్లపై కంపెనీలు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ పరిణామాల నేపథ్యంలో మాస్కో నుంచి డిస్కౌంట్ ధరకు భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తోంది. రష్యా చమురుకు ప్రస్తుతం భారత్ ప్రధాన మార్కెట్‌గా ఉంది.
ఈ సంవత్సరం జూన్‌లో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున మాస్కో చమురు దిగుమతి కాగా, అక్టోబర్‌లో అది 1 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ అనలిటిక్స్ సంస్థ ఇటీవల పేర్కొంది. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ట్రంప్ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడ ఈ దిగుమతులను భారత్ తగ్గించుకుంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ట్రేడ్ డీల్‌తో ప్రస్తుతం 50 శాతం ఉన్న సుంకాలు 15 శాతానికి దిగి రావొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.