calender_icon.png 24 October, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్ట పనులకు నర్సన్నే దిక్కు!

24-10-2025 01:22:54 AM

బాదిని నర్సింహ :

అభివృద్ధి.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే!

  1. సాంకేతిక పనులన్నింటికీ ఫుల్‌స్టాప్ 
  2. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో రూ. 360 కోట్లు 
  3. కమాండ్ కంట్రోల్ కార్యాలయం అలంకార ప్రాయమే!

నల్లగొండ బ్యూరో, అక్టోబర్ 23(విజయక్రాంతి): తెలంగాణలో భక్తు లకు కొంగు బంగారమైన  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆల యం రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపుతో మసకబారుతున్నది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగినా, అభివృద్ధి పను లు మాత్రం కుంటుబడ్డాయి. కుంటుబడడం కాదు..  కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆలయ పునర్నిర్మాణం లో 90 శాతం పనులు పూరైనా, మిగిలిన 10 శాతం పనులు పూర్తి  చేసేదుకు ప్రస్తుత ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది.

అభివృద్ధి చేస్తా మని నాయకులు ఎన్ని మా టలు చెప్పినా, పనులు మాత్రం మూడు అడు గులు ముందుకి.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. టికెట్ల రూపంలో భక్తుల నుంచి డబ్బులు గుంజుతున్నా అభివృద్ధి శూన్యమైంది. ఆలయ పనుల్లో కాంట్రాక్టర్లకు రూ. 380 కోట్లు పెండింగ్‌లో వున్నాయి. మరోపక్క దుకాణాలు కేటాయింపులు పొందిన కొందరికి ప్రోసీడింగ్‌లే ఇవ్వలేదు. దానితో ఆ దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి.

సొంత బస్సులులేని దేవస్థానం, భక్తుల ఉచిత ప్రయాణం కోసం నెలకు కోటిన్నర రూపాయల దాకా ఆర్టీసీకి చెల్లిస్తున్నది. ఆర్టీసీకి ఇచ్చే నెలవారి కిరాయితోనే దేవస్థానం బస్సులు కొనుగోలు చేయవచ్చు. కొండపైన కమాండ్ కంట్రోల్ కార్యాల యం ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది, పరికరాలు లేక పోవడంతో అలంకార ప్రాయంగా మిగిలింది.

ఇటీవల యాదగిరిగుట్ట క్షేత్రంలో సిబ్బంది చేతివాటం కూడా వెలుగులోకి వచ్చింది. ఇతర రూపాల్లోనూ నర్సన్న సొత్తు చోరీ అవుతుందనే అనుమానాలున్నాయి. టీటీడీ తర హాలో యాదగిరిగుట్టకు ఆలయ బోర్డును ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపె ట్టినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, తమ వర్గానికే పద వులు  రావాలని పట్టుబడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

  1. యాదాద్రిలో అ(హ)రిగోస
  2. నిలిచిన అభివృద్ధి పనులు
  3. గుట్ట అభివృద్ధి మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి..
  4. మాటలకే పరిమితమైన సర్కార్
  5. గుట్టలో ఎక్కడి పనులు అక్కడే..
  6. పార్కుకే పరిమితమైన టెంపుల్ సిటీ
  7. సాంకేతిక పనులన్నింటికీ ఫుల్‌స్టాప్

నల్లగొండ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి, ప్రపంచ ప్రసిద్ధి పొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహా స్వామి ఆలయం ప్రతిష్ఠ మసకబారు తోంది. దాదాపు రూ.1,300 కోట్లతో చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రాక ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. గత బీఆర్‌ఎస్ హయాంలో కనివినీ ఎరుగని రీతిలో యాదగిరిగుట్ట ఆల యం పునర్నిర్మాణం జరిగింది. అయితే ఆల య నిర్మాణం పూర్తిస్థాయిలో పూర్తికాకముందే బీఆర్‌ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అయితే గత ప్రభు త్వ హయాంలో యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి తీసుకున్న ప్రతిపాదనలు, చేపట్టిన పనులు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కార్ ఒకట్రెండు పనులు మినహా యాదగిరిగుట్ట క్షేత్రంపై చేపట్టింది లేదు. ఓవైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో యాదగిరిగుట్ట క్షేత్రం ప్రతిష్టపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ప్రధానం గా అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పాటు సాంకేతికంగా చేపట్టాల్సిన పనులకు సైతం బ్రేక్ పడటంతో ఆలయానికి రక్షణ సైతం కరువయ్యింది. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టెంపుల్ సిటీ సైతం వాయిదా పడి పార్కుకే పరిమితమయ్యింది. కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి పనులు మూడు అడుగులు ముందుకి.. ఆరు అడుగులు వెన క్కి అన్న చందంగా పరిస్థితి తయారయ్యింది.

గత ప్రభుత్వం చేపట్టిన బంగారు తాపడం పనులు మినహా ఇప్పటి సర్కార్ ఏ పనీ పూర్తి చేయకపోవడం కొసమెరుపు. పైగా ప్రజల నుంచి టికెట్ల రూపంలో డబ్బులు దండుకుంటూ.. మరోవైపు యాదగిరిగుట్ట ఆదాయానికి గండిపెడుతోంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంలో దుకాణాలు కోల్పో యిన వారిలో 80 మందికి కుంటిసాకులు చెపుతూ దుకాణాలను కేటాయించకపోవ డం కొసమెరుపు.

ఇదిలావుంటే.. బీఆర్‌ఎస్ హయాంలోనే టెంపుల్ సిటీపై 250 డోనర్ కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదించి ఇందుకు అనుగుణంగా లే అవుట్, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. నిర్మాణాలకు డోనర్లు సైతం మందుకువచ్చినా కాటేజీల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. దీంతో కేవలం టెంపుల్ సిటీ పార్కుగానే పరిమితమయ్యింది. కాంగ్రెస్ హయాంలో కొత్త గా ఒక్క గిరి ప్రదక్షిణను మాత్రం చేపట్టింది.

డవలప్‌మెంట్ వర్క్స్‌లో నో మూమెంట్..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో అభివృద్ధి పనుల్లో ఎలాంటి కదలిక లేదు. ఇటీవల ఒక్క ఫ్లుఓవర్ విషయంలో మాత్రం కాస్తంత కదలిక వచ్చింది. గత సర్కారు అధికారం కోల్పోయే నాటికి 90 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుత సర్కారు అపసోపాలు పడుతోంది.

ప్రధానంగా కొండపైకి వెళ్లేందుకు ఎంట్రీ ఫ్లై ఓవర్ గండిచెరువు సుందరీకరణ, కొండకిం ద దేవస్థాన బస్టాండ్, దేవస్థానం ఆధ్వర్యం లో బస్సుల కొనుగోలు, పెద్దగుట్ట నుంచి కొండపైకి రోప్ వే, కొండకింద కల్యాణకట్ట వద్ద సీఆర్, క్లాక్ రూమ్, రాయగిరి నుంచి కొండపై వరకు ఇజ్రాయెల్ సాంకేతితను జోడిస్తూ సౌండ్ సిస్టంతో కూడిన కెమెరా లు, మెట్లదారి నుంచి వచ్చే భక్తులను గుర్తిం చే వ్యవస్థను గత ప్రభుత్వం ప్రతిపాదించిం ది.

ఇందుకోసం నిధులను సైతం కేటాయించింది. కానీ 90 శాతం పనులు పెండిం గ్‌లోనే ఉండిపోయాయి. మరోవైపు ఇప్పటి కీ రూ.380 కోట్లు నిధులు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో సైతం నిధుల కేటా యింపును విస్మరించింది. ఇదిలావుంటే.. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అయితే అందుకు సంబంధించిన డబ్బులను మా త్రం యాదగిరిగుట్ట ఆలయమే చెల్లిస్తోంది.

రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఆలయం నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. వాస్తవానికి యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు నెలకు సుమారుగా రూ.కోటి నుంచి కోటిన్నర వరకు దేవస్థానం చెల్లిస్తోంది. రాబోయే రోజుల్లో దేవస్థానం ఆధ్వర్యంలోనే బస్సులు వేసి ఉచిత ప్రయా ణం కల్పించాలని గత ప్రభుత్వం సర్కార్ సంకల్పింది.

ఇందుకోసం బడ్జెట్‌ను కేటాయించి తొలి విడతగా 40 నుంచి 50 బస్సు లను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ సైతం ఇప్పుడు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బస్సుకు ఇచ్చే నెలవారి కిరాయి తోనే దేవస్థానం బస్సులు కొనుగోలు చేయవచ్చు. ఖర్చు సైతం తక్కువగానే వస్తోందని దేవస్థాన అధికారులు తెలుపుతున్నారు.

సాంకేతిక పనులు పెండింగ్

స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారికి భద్రతను కల్పించేందుకు ఇజ్రాయిల్ దేశం నుంచి ప్రత్యేకమైన అధునాతన విద్యుద్దీపాలను యాదగిరిగుట్ట పరిసర ప్రాంతా ల్లో బిగించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయగిరి నుంచి స్వామివారి వైకుంఠ ద్వారం, టెంపుల్ సిటీ, రింగురోడ్డుతో పాటు గుట్ట చుట్టూ సుమా రు 5.7 కిలోమీటర్ల మేర 200 మీటర్ల దూరంలో ఒక్కో విద్యుద్దీపాన్ని అమర్చాల్సి ఉంది.

ఇందులో సీసీ కెమెరాతో పాటు సౌండ్ సిస్టం సైతం రావడంతో స్వామివారి నిత్య కైంకర్యాలు సౌండ్ సిస్టం ద్వారా రాయగిరి వరకు భక్తులకు వినిపిస్తాయి. సుస్ప ష్టమైన సీసీ కెమెరా ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. భక్తుడికి ఏదైనా సమస్య వాటిల్లితే ఈ కెమెరా వద్దకు వచ్చి హెల్ప్, హెల్ప్ అని చెబితే చాలు నేరుగా కమాండ్ కంట్రోల్‌కు సమాచారం వెళ్తుంది.

ఇలాంటి ఆధునిక సాంకేతికను ప్రస్తుత సర్కారు పక్కన పెట్టేసింది. కానీ భక్తుల నుం చి ఆదాయం రాబట్టుకునేందుకు మాత్రం ముందుంటోంది. కొండపైన ఉన్న పుష్కరిణిలో స్నానాలు ఆచరించి పూజలు చేసేందు కు ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తోంది. మరోవైపు సత్యనారాయణస్వామి వ్రత టికెట్ ధరను సైతం రూ.వెయ్యికి పెంచేశారు.

పెండింగ్‌లోనే పాలకమండలి

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ఆల య బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించింది. కొత్త చట్టం ప్రకా రం యాదగిరిగుట్ట ఆయలయానికి బోర్డు ఏర్పాటు చేసేందుకు రూట్ క్లియరైంది. ఒక చైర్మన్, 11 మంది పాలక మండలి సభ్యులు, మరో 6 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 18 మందితో బోర్డ్ ఏర్పాటు కు నిర్ణయం జరిగింది. అయినా ఈ వ్యవహా రం ఇంతవరకు కొలిక్కి రాలేదు.

నెలల తరబడి తీవ్ర కసరత్తు జరుగుతున్నా.. ప్రభుత్వం తేల్చలేకపోతోంది. నిజానికి చివరిసారిగా 2008లో ఏర్పాటైన ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. అప్పటి నుంచి 15 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్వహణ కొనసాగుతోంది.

అయితే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆల య పాలక మండలి ఏర్పాటుకు ఎందుకు ముందడుగు పడటం లేదు? రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ చట్ట సవరణ చేశాక కూడా ఎక్కడ తేడా కొడుతోంది? నెల ల తరబడి కసరత్తులు జరుగుతున్నా.. పాలకమండలి ఎంపిక కొలిక్కి రాకపోవడానికి కారణాలేంటి? అన్నది ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. 

కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇలా ఎవరికి వారే బోర్డ్ చైర్మన్, సభ్యుల పదవుల కోసం గట్టి ప్రయత్నాల్లో ఉండటంతోనే తుది నిర్ణయంలో జాప్యం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా చైర్మన్ పదవి తన వర్గానికంటే తన వర్గానికే కావాలంటూ ఇద్దరు మంత్రులు పట్టుదలకు పోవ డం వల్ల ఎంపిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. చైర్మన్ వ్యవహారం దగ్గరే అసలు సమస్య ఉండటంతో బోర్డు సభ్యుల సంగతి పట్టించుకునే పరిస్థితే లేదు.

గుత్తేదారులకు పెండింగ్‌లో రూ.360 కోట్లు

గత ప్రభుత్వ హయాంలో గుత్తేదారులకు ఇవ్వాల్సిన నిధులు రూ.380 కోట్లు పెండింగ్ ఉండగా నిధుల విడుదలలో ప్రభుత్వం ఆలసత్వం వహిస్తోంది. దీంతో పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. అభివృద్ధిలో భాగంగా స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు ఇరువైపులా దుకాణాలు కోల్పోయిన వారికి కొండకింద కల్యాణకట్ట వద్ద సుమారు 139 నిర్మించగా, 53 మంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్‌లు అందజేయగా, ఇంకా 86 మందికి దుకాణాలు కేటాయించలేదు.

దీంతో దుకాణాలు నిరుపయోగంగా మారి.. ఎందుకూ పనికి రాకుండాపోతున్నాయి. ఇదిలావుంటే కొండకింద పార్కింగ్ ప్రాంతంలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్మిస్తామని గత ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఇందుకు సం బంధించిన ప్రణాళికలు సైతం వైటీడీఏ సిద్ధం చేసినా ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

యాదాద్రి నర్సన్నకు రక్షణేదీ?

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం భద్రతను సర్కార్ గాలికొదిలేసింది. కొండపైన కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలింది. యాదగిరి క్షేత్రం అభివృద్ధి తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్రపతి, ప్రధాని వంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న ప్రముఖులతోపాటు ముఖ్యమంత్రులు, న్యాయమూ ర్తులు, ఇటీవల విశ్వం నలుమూలల నుంచి అందగత్తెలు వచ్చారు.

ఇలా ఒకరేమిటి వివిధ స్థాయిల్లోని ప్రముఖులు వస్తున్నా రు. వీరి భద్రత కోసం ఎప్పటికప్పుడు ఇత ర ప్రాంతాల నుంచి పోలీసులను తీసుకువచ్చే కంటే స్థానికంగా ఆర్మీ ఫోర్సును సిద్ధగా ఉంచాలని గతంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గుర్తించిన గుట్ట క్షేత్రం భద్రతకు ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించారు. ఇదీగాక బ్రహ్మోత్సవాల సమయంలో వీవీఐపీలు గుట్టకు వచ్చినప్పుడు రక్షణ బాధ్యతలను చూడటానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రిజర్వ్ పోలీస్, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. 25 మందితో ఆక్టోపస్ పోలీస్ దళం ఉంటుందని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. దేవాలయ అభివృద్ధికి కేటాయించిన భూమిలోనే 30 ఎకరాల స్థలం యాదాద్రి ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని చదును చేసి వదిలే శారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. 

మరోవైపు ఇటీవల యాదగిరిగుట్ట క్షేత్రంలో సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది. చింతపండు దొంగతనం వెలుగుచూడటంతో ఆలయ భద్రతలో ఉన్న డొల్లతనం బయట పడింది.  కానీ నిజానికి ఇతర రూపాల్లోనూ నర్సన్న సొత్తు చోరీ అవుతుందనే అనుమానాలు లేకపోలేదు. అసలే శ్రీస్వామివారికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటికి సైతం రక్షణ కరువయ్యింది.