తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్
ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం.
హైకోర్టు వెబ్‌సైట్‌లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం.
పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు.హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో(Telangana High Court website) సైబర్ దాడి గురించి హైకోర్టు (ఐటీ) రిజిస్ట్రార్ టి. వెంకటేశ్వరరావు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సైబర్ దాడి సంఘటన వెలుగులోకి వచ్చింది. హైకోర్టు అధికారిక వెబ్‌సైట్- tshc.gov.in ను ట్యాంక్ బండ్ రోడ్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుండి నిర్వహిస్తున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుండగా ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకున్నట్లు తెలిపారు. పీడీఎఫ్ ఫైల్స్ కు బదులుగా బీడీజీ స్టాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు కోరారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు సెక్షన్ 66 రీడ్ విత్ 43, 66 (C), 66(D) ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ సెక్షన్ 337, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3(1)(i) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




