11-11-2025 12:00:00 AM
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఆందోళన కలిగిస్తున్నది. వా యు కాలుష్యంతో తమకు ముప్పు పొంచి ఉందంటూ ఢిల్లీలోని వివిధ వర్గాల ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు, పర్యావరణ కార్యకర్తలు ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టడం పరిస్థితి తీవ్రతను తెలి యజేస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం 300 మధ్య గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఉంటేనే అత్యంత ప్రమాదకరం. సోమవారం ఉదయం వరకు ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో 379, ఐటీవో ప్రాంతంలో 360 , ఓఖ్లా ఫేజ్ 348, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 316, గురుగ్రామ్ సెక్టార్ 51 వద్ద 327 ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో ఒక్కరోజు గాలి పీలిస్తే సగటున 20 సిగరెట్లు తాగిన దానితో సమానం.
అందుకే ఆదివారం ఢిల్లీలోని ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి ‘మాకు ఊపిరి ఆడడం లేదు.. ఊపిరి పీల్చుకోవడానికి సహాయం చేయండి. దేశ రాజధానిలో స్వచ్ఛమైన గాలి కనుమరుగైంది’ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. భౌగోళికంగా ఢిల్లీ ఉన్న ప్రదేశం చాలా సంక్లిష్టమైనది. చలికాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. వాహనాల పొగ, నిర్మాణ పనుల నుంచి రేగే ధూళి, పంట వ్యర్థాల దహనం లాంటి వాటితో పీఎం 10 వంటి సూక్ష్మ రేణువులు ఉధృతమవుతుంటాయి. ఇటీవలే దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. చాలా ప్రాంతాలు దట్టమైన పొగమంచు గుప్పిట్లో చిక్కుకుపోయాయి. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ తీవ్ర స్థాయికి పడిపోయింది.
అయితే ఢిల్లీని కాలుష్య కోరల నుంచి బయటపడేందుకు ప్ర భుత్వం ఎప్పటికప్పుడు చర్యలకు ఉపక్రమిస్తూ వచ్చింది. మేఘమథనం ద్వారా కృత్రిమ వానలు కురిపించి, వాతావరణంలోని కాలుష్య కారకాల ను తొలగించవచ్చని భావించింది. కానీ వీరి ప్రయత్నాలు సఫలీకృతమవ్వలేదు. ఢిల్లీ నగరంలోని ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం 3.21 కోట్లను ఖర్చు చేసింది. కృత్రిమ వర్షం వల్ల కాలుష్యాన్ని కొంత వరకు మాత్రమే తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వర్షం కురుస్తున్నప్పుడు గాలిలోని ధూళి రేణువులు.. వర్షపు బిందువులతో కలిసి నేలను చేరుతాయి. ఫలితంగా వాతావరణం కాలుష్యరహితమవుతుంది.
ఢిల్లీ రాజధాని ప్రాంతం దాదా పు వెయ్యి చదరపు కి.మీ పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ వైశాల్యం మొ త్తంలో కృత్రిమ వర్షాలు కురిపించడం అంత సులభం కాదు. ఎందుకంటే రాజధాని ప్రాంతమంతటా ఒకేసారి మేఘాలు ఏర్పడవు. ఢిల్లీలో కాలుష్యానికి పంట వ్యర్థాలను తగలబెట్టడంతో పాటు రోడ్ల మీద సంచరిస్తున్న వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వాటానే 10 నుంచి 30 శా తం ఉందని లెక్కల్లో తేలింది. అలాగే పరిశ్రమలు, విద్యుదుత్పాదన కేం ద్రాలు విడిచిపెట్టే వ్యర్థాలు, వాటిని దగ్ధం చేయడం వల్ల వాయు కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. ఏదీ ఏమైనా వాహన ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం, నిర్మాణ పనులను సమర్థంగా నియంత్రించినప్పుడే ఢిల్లీ కాలుష్యానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశముంటుంది.