calender_icon.png 13 November, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బుగ్గ దేవస్థానంలో గంగా హారతి..!

13-11-2025 04:38:17 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ కోనేరులో ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య గంగా హారతి చేపడుతున్నట్లు మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్, అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు తెలిపారు. భారతదేశంలోని 14 నదుల నీళ్లను బుగ్గ కోనేరులో మిళితం చేయనున్నట్లు చెప్పారు. దేవస్థాన అర్చకులు సతీష్ శర్మ సమక్షంలో బ్రాహ్మణోత్తముల చే ఉదయం 10 గంటలకు గంగా హారతి పూజా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. గంగా హారతి అనంతరం గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో వాయునం సమర్పించనున్నట్లు చెప్పారు. గంగా హారతి కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఆది గంగకు ఘనమైన పూజలు! 

బుగ్గ దేవస్థానం అతి పురాతనమైనది. మహిమాన్వితమైనది. తెలంగాణలో రెండవ వేములవాడగా ప్రసిద్ధిగాంచినది. భక్తుల ఘనమైన పూజల మధ్య నిత్య నూతనంగా విరాజిల్లుతున్నది. అతి పురాతనమైన ఈ శివాలయంలో ఎత్తైన గుట్టల మీద నుండి అంతుచిక్కని రహస్యంగా ఉద్భవించిన గంగమ్మ తల్లి గర్భగుడిలో స్వయంభుగా వెలసిన శివలింగంపై నిత్య అభిషేకం చేస్తుంది. ఈ అపూర్వ సుందర దృశ్యం తెలంగాణలోని ప్రత్యేకతను పొందింది. పచ్చటి అడవి మధ్యలోని ఏటవాలు కొండల మధ్య ఉద్భవించిన ఆదిగంగకు దేశంలోని 14 నదుల నీళ్లను మిళితం చేసి శుక్రవారం ఘనమైన పూజలు అందించేందుకు మాజీ చైర్మన్ మాసాడి శ్రీరాములు శ్రీదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేపడుతున్నట్లు చెప్పారు.

భక్తులు తీసుకురావలసిన పూజ సామాగ్రి 

బుగ్గ దేవస్థానం వద్ద గల కోనేరులో గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనే మహిళా భక్తులు తప్పనిసరిగా తమ వెంట పూజా సామాగ్రిని తెచ్చుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. పూజలో పాల్గొనే మహిళలు పిండి దీపాలు, తామర డొప్పలు, వత్తులు, తమలపాకులు, పువ్వులు వెంట తెచ్చుకోవాలని చెప్పారు.