రెడ్డి సంఘాలన్ని ఏకతాటిపైకి రావాలి
- రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి
- చంపాపేటలో తెలంగాణ రెడ్డి సంఘం కేంద్ర కార్యాలయం ప్రారంభం
ఎల్బీనగర్: తెలంగాణలోని రెడ్డి సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రెడ్డి సంఘం అడ్ హక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ల సంక్షేమం కోసం చంపాపేటలో శుక్రవారం జిట్టా యాదవ్ రెడ్డి భవన్ లో తెలంగాణ రెడ్డి సంఘం కేంద్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని సంఘాలు ఏకతాటి దిగి రావడం ఒకే సంఘం ఏర్పాటు చేయటం శుభ సూచకమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ పాలకవర్గాన్ని కూడా నియమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి వర్గానికి చెందిన నిరుపేద విద్యార్థులు తమ అవసరాలను కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తే తమ వంతుగా చేయూతనిస్తామని అడ్ హక్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి లందరూ ఒకటే రెడ్డి సంగం ఒక్కటే అనే నినాదంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న జిల్లా మరియు మండల స్థాయి గ్రామస్థాయి సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు.






