08-09-2025 08:54:27 AM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం చంద్రగ్రహణం తర్వాత ఆలయాలు తెరుచుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో శ్రీవారి ఆలయ తలుపులు టీటీడీ అధికారులు తెరిచారు. ఆలయ శుద్ధి పుణ్యాహవచనం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. అధికారులు వేకువ జామున 2.40 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. అనంతరం సుప్రభాత సేవను ఏకాంతంగా అర్చకులు నిర్వహించారు. అటు శ్రీశైలం మల్లన్న ఆలయంలో చంద్రగ్రహణం సంరక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలు అధికారులు తెరిచారు. ఆలయం శుద్ధి తర్వాత ప్రాతః కాల పూజలు అర్చకులు చేశారు. ఉదయం 7:30 నుంచి భక్తులకు స్వామివార్ల దర్శనాలు జరుగుతున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉదయం 8:30 నుంచి భక్తుల దర్శనానికి ఆలయ అధికారులు అనుమతిస్తున్నారు. ప్రోక్షణ పూజల తర్వాత అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. చంద్రగ్రహణం ముగిసినందున భద్రాద్రి రామాలయం(Sree Sita Ramachandra Swamy Temple) తలుపులు కూడా తెరుచుకున్నాయి. తెల్లవారుజామున మూడు గంటలకే రామాలయం తలుపులు అధికారులు తెరిచారు. అనంతరం సుప్రభాత సేవ తర్వాత గోదావరి జలాలతో అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. అలాగే ప్రధాన ఆలయంలో సీతారాముల మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు. నిత్య కైంకర్యాలు నిర్వహించి యధావిధిగా భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Lakshmi Narasimha Swamy) ఆలయాన్ని అధికారులు తెల్లవారుజామున మూడున్నర గంటలకు తెరిచారు. నిత్య కైంకర్యాలు నిర్వహించి యధావిధిగా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని(Gnana Saraswati Temple Basara) కూడా అధికారులు తెరిచారు. ఆలయంతో పాటు ఉపాలయాల్లో కవాటోద్ఘాటనం గణపతి పూజ అర్చకులు నిర్వహించారు. వేకువ జాము నుంచి మహా సంప్రోక్షణ ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి ఆలయంలో యధావిధిగా తిరిగి అక్షరాభ్యాసాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. కాగా, చంద్రగ్రహణం రాత్రి 9.56 గంటలకు మొదలై అర్ధరాత్రి 2.25 గంటలకు వీడింది. భారత్ సహా ఆసియా, ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది.