08-09-2025 01:12:02 PM
పాడైన రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలుస్తాం..
రోడ్లు భవనాల శాఖ జిల్లా అధికారి సురేష్ బాబు..
హన్మకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గం కంఠాత్మకూర్ వంతెన నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతులకు టెండర్లు ప్రకటించడం జరిగిందని రోడ్డు భవనాల శాఖ జిల్లా అధికారి పి. సురేష్ బాబు(District Officer Suresh Babu) తెలిపారు. కంఠాత్మకూర్ వంతెన నిర్మాణానికి గాను పదికోట్ల నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 70% పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నెలాఖరి కల్లా వంతెన నిర్మాణ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. కాజీపేట దర్గా నుండి బట్టుపల్లి బైపాస్ రోడ్డు వరకు 68 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. వంతెన నిర్మాణానికి గాని 28 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పరకాల నుండి గూనిపర్తి వరకు ఫోర్ వే లైన్ రహదారి నిర్మాణ పనులకు గాను 65 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా కమలాపూర్ మండలం గూడూరు నుండి కేశవాపూర్ వాగు వరకు రోడ్డు నిర్మాణం కోసం 25 కోట్ల నిధుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. కేశవాపూర్ నుండి హాసన్ పర్తి వరకు రోడ్డు మరమ్మతుల కోసం టెండర్ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరకాల నుండి ఎర్రగట్టుగుట్ట రహదారిలో ఏర్పడిన గుంతల పూడ్చివేతలకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ములుగు రోడ్డు జంక్షన్ లోని పాడైన రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయించినట్లు తెలిపారు. తాత్కాలికంగా చేపడుతున్న ప్యాచ్ వర్క్ దెబ్బతింటున్న కారణంగా వాటి స్థానంలో సిమెంట్ రోడ్లను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రోడ్డు మరమ్మతుల పనుల పర్యవేక్షణను, వంతెన నిర్మాణాల పనుల పర్యవేక్షణలో హనుమకొండ, పరకాల డిఈ రాజు, గోపికృష్ణలతో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.