08-09-2025 12:37:21 PM
కమలాపూర్/హనుమకొండ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వము రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని అధికారులు, పాలకులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులు యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షణ చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్, దామెర, ఆత్మకూర్, పరకాల, ధర్మసాగర్, నడికూడ, వేలేరు, ఎలుకతుర్తి, భీమదేవరపల్లి తదితర మండలాల్లో యూరియ కొరత నెలకింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించుకునే రైతులకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పనులు చేసుకోలేక ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగి నిరీక్షణ చెందుతున్నారు. పంటలు దిగుబడి రాదేమోనని ఆందోళన చెందుతున్నారు.
కమలాపూర్ మండలంలోని మరిపెల్లి గూడెం ప్రాథమిక సహకార కేంద్రం కార్యాలయంలో గత రెండు రోజులుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులు ఫర్టిలైజర్ షాపుల యజమానులతో కుమ్ముక్కై వందల బస్తాలు పక్కదారి పడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు కళ్ళు తెరిచి రైతులకు సరిపడా యూరియా బస్తాలను సరఫరా చేసి,పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.