3 July, 2026 | 1:58 AM

క్యూర్‌లో ఇందిరమ్మకు త్వరలో టెండర్లు

03-07-2026 01:06 AM
  1. తుది దశలో ఇళ్ల స్థలాల సేకరణ
  2.   19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్
  3. దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు
  4. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమై న స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికీ ఇల్లు అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5,500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా ఆ భూముల విలువను పక్కనబెట్టి పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి, వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. దూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తున్నామని, మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పేదలను నగరాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోకి తరలించి ఇళ్లు కట్టే విధానం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదని, వారి జీవనాధారాలకు దగ్గరగా, అదే నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు అందించడం ప్రభుత్వ కట్టుబాటు అని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే కేవలం రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తుందన్నారు.

ఇది సాధ్యం కాకపోతే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని విసిరిన సవాల్‌కు ఇప్పటివరకు బీఆర్‌ఎస్ నేతల నుంచి స్పందన రాలేదని గుర్తుచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రయోజనం లేదనే ఆలోచనతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం అవే నిధులను పేదల గూడు కోసం వినియోగిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గుడిసెల్లేని తెలంగాణ లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.