రోటిబండ తండాలో మరోసారి ఉద్రిక్తత
- ఇండస్ట్రియల్ పార్కుకు తమ భూములు లాక్కోవద్దని రైతుల వేడుకోలు
- భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వేను పూర్తి చేసిన అధికారులు
వికారాబాద్, ఫిబ్రవరి- 7 : కొడంగల్ నియోజకవర్గo లగచర్లలో మరోసారి స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ నిర్వహించేందుకు శుక్రవారం అధికారులు రోటిబండ తండాకు వచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న లగచర్ల ఘటనను దృష్టిలో పెట్టుకున్న అధికారులు పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మొహరించారు.
అయినప్పటికీ లగచర్ల, రోటిబండ తండా రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు తమ భూములు ఇచ్చేది లేదంటూ ప్లేకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. సర్వేకు వచ్చిన అధికారులు పోలీసులు రైతులకు నచ్చే చెప్పే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ రైతులు ఒక గంట సేపటి వరకు సర్వే నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు అధికారులు పోలీసుల సహకారంతో రైతులను అక్కడి నుంచి పంపించి సర్వే నిర్వహించారు. తమ బతుకులకు జీవనాధారమైన భూములను ప్రభుత్వం లాక్కోవద్దని రైతులు అధికారులను వేడుకున్నారు.
రోటి బండ తండాలో జరుగుతున్న భూసేకరణ సర్వే గురించి తెలుసుకున్న పోలేపల్లి, పులిచెర్ల, దుద్యాల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎట్టకేలకు అధికారులు భూసేకరణ సర్వే నిర్వహించారు.




