14-09-2025 10:48:51 AM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ నయీమ్ నగర్ తేజస్వి పాఠశాలలో ఇటీవల మరణించిన పదవ తరగతి విద్యార్థి పోలేపల్లి జయంతి వర్ధన్ మరణ వార్తను తెలుసుకున్న ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్(Women and Child Protection) వైస్ చైర్ పర్సన్ చిగుమల మౌనిక తన బృందంతో విద్యార్థి తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. విద్యార్థి యొక్క మరణ సమాచారాన్ని, పాఠశాల నిర్వర్తించిన విధానాన్ని గురించి కులం కుశంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే బాబు చనిపోయాడని, సిపిఆర్ కూడా చేయలేదని, త్వరగా ఆస్పత్రికి చేర్చి ఉంటే బాలుడు బ్రతికేవాడని ఆరోపిస్తున్నారు. కొడుకు దూరం కావడంతో కన్నీటి పర్యంతం చెందిన బాలుడి తల్లిదండ్రులు సిసి ఫుటేజ్ డిలీట్ అయిందని, కనీసం ఓఆర్ఎస్ కూడా తాగించకుండా సమయం వృధా చేసి హాస్పిటల్కు తీసుకెళ్లారన్నారు.
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చాలా వరకు ఉందని అన్నారు. ముందుగా బాబుకు తల నొప్పి ఉందని చెప్పినప్పటికీ సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయుడు పట్టించుకోలేదని,బాబుతో విపరీతంగా రౌండ్స్, గుంజీలు వంటివి తీపించారని బాలుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయునికి సంబంధించిన బిపిడి సర్టిఫికెట్స్ లేకుండానే స్కూల్ యాజమాన్యం ఎలా తీసుకుంటుందని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని నా కొడుకు జరిగిన అన్యాయాన్ని ఏ విద్యార్థికి జరగకుండా చూడాలని, పాఠశాలలో మెడికల్ కిట్లను, నర్సును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ వైస్ చైర్ పర్సన్ చిగుమల మౌనిక మరియు బృంద సభ్యులు పాల్గొన్నారు.