calender_icon.png 17 December, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 3 నుంచి టెట్

17-12-2025 01:23:48 AM

9 రోజులు.. 15 సెషన్‌లో పరీక్షలు

తొలి రోజు పేపర్- 2 అభ్యర్థులకు..

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)- 2026 షెడ్యూల్ విడుదలైంది. జనవరి 3 నుంచి జనవరి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీటీ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజూ రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.

మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పేపర్-1, పేపర్-2గా ఈ పరీక్షల కోసం జిల్లావారీగా పరీక్షల తేదీలు, సబ్జెక్టుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్-1, ఆరో తరగతి, ఆపై బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్-2 కింద పరీక్ష నిర్వహించను న్నారు. ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉండగా, కొన్ని మైనర్ సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠి, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాల్లో కూడా నిర్వహించనున్నారు. పేపర్-2 విభాగంలోని మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ పరీక్షలు తొమ్మిది సెషన్‌లు, పేపర్-1 పరీక్షలు ఆరు సెషన్‌లలో జరగనున్నాయి.