భద్రాద్రికి చేరిన పాఠ్యపుస్తకాలు
భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో విద్యా శాఖ ఆ దిశగా అడుగులు వేస్తోంది. పాఠ్యపుస్తకాల సరఫరాను వేగవంతం చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 5.17 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా, రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటి వరకు 1,89,350 పుస్తకాలను సరఫరా చేసింది. ప్రస్తుతం వాటిని కొత్తగూడెంలోని ఓ గోదాములో భద్రపరిచారు. అలాగే 2,66,458 నోటు పుస్తకాలు అవసరం ఉండగా, 2,38,290 నోటు పుస్తకాలు గోదాముకు చేరుకున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఇంకా నెల రోజుల వ్యవధి ఉండటంతో అధికారులు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూపు దుస్తులు సేకరిం చే పనిలో నిమగ్నమయ్యారు. మిగిలినవి పాఠశాలలు తెరిచే నాటికి ముందే సిద్ధం చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి తెలిపారు.




