calender_icon.png 21 November, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఎస్పీడీసీఎల్‌కు ఫోన్‌పే ద్వారానూ కరెంట్ బిల్లులు కట్టొచ్చు

17-08-2024 12:30:25 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 16 (విజయక్రాంతి): విద్యుత్ బిల్లులను టీజీఎస్పీడీసీఎల్ యాప్‌తో పాటు ఫోన్‌పే ద్వారా కూడా చెల్లించవచ్చని విద్యుత్ శాఖ ప్రకటించింది. గత జూలై 1 నుంచి ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్‌లు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీజీఎస్పీడీసీఎల్ యాప్, వెబ్‌సైట్‌లోనే చెల్లించాలని షరతు పెట్టాయి. అయితే ఈ యాప్‌లో బిల్లులను చెల్లించడం వలన విద్యుత్ వినియోగదారులకు ప్రతి బిల్లుపై రూ.2.75 అదనపు భారం పడుతున్నది.

అలాగే ఈ యాప్ అత్యంత క్లిష్టంగా ఉండటంతో మెజార్టీ విద్యుత్ వినియోగ దారులు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే టీజీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా చెల్లింపులతో వినియోగదారుల జేబులకు చిల్లుపడుతున్నదని ‘కరెంట్ బిల్లుపై కన్వీనియన్స్ షాక్’ శీర్షికతో ‘విజయక్రాంతి’లో ఆగస్టు 9వ తేదీన మొదటిపేజీలో కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన డిస్కమ్‌లు టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌తో పాటు ఫోన్‌పే పేమెంట్స్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే వెసులుబాటును తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో భాగంగా వినియోగదారులు విద్యుత్ బిల్లుల చెల్లింపులోను నేరుగా యూపీఐ పేమెంట్స్‌ను అనుమతి ఇచ్చినట్లు డిస్కమ్ అధికారులు తెలిపారు.