calender_icon.png 21 November, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్!

17-08-2024 12:32:21 AM

కేటీఆర్ పీసీసీ చీఫ్

హరీశ్‌రావుకు మినిస్ట్రీ 

కవితకు రాజ్యసభ

త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం

న్యాయస్థానాలపై సీఎం బురదచల్లడం సహేతుకమా?

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): త్వరలో బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని, కేసీఆర్ ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ పీసీసీ చీఫ్ అవుతారని, హరీశ్‌రావుకు మంత్రి పదవి లభిస్తుందని.. కవితకు రాజ్యసభ ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమవుతుందని.. అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా సంజయ్ తెలిపారు.

కవిత బెయిల్‌కు బీజేపీకి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. కవిత బెయిల్ అంశం కోర్టు పరిధికి సంబంధించినదని అన్నారు. ఆప్‌ను విలీనం చేసుకుం టేనే ఢిల్లీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ న్యాయస్థానాలపై బురద చల్లడం ఎంతవరకు సహేతుకమన్నారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి విమర్శలు చేస్తున్నారని అన్నారు. కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తీరు ఉందని బండి తెలిపారు. 

బీఆర్‌ఎస్‌తో పొత్తు.. మాకేం ఖర్మ

బీఆర్‌ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయమని, ప్రజలు ఛీత్కరించిన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమకేం పట్టలేదని సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ తమ పార్టీలో కలిపేసుకోవాలని కాంగ్రెస్ పార్టీయే తహతహలాడుతోందన్నారు. పథకం ప్రకారమే కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, అతి త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో పూర్తిగా విలీనమవడం ఖాయమన్నారు. గతంలోనూ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతోపాటు మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలన్నారు. లేదంటే దాగుడుమూతలు ఆడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.