17-08-2024 12:00:00 AM
హైదరాబాద్/నల్లగొండ, ఆగస్టు 16 (విజయక్రాంతి): కృష్ణ, గోదావరి నదుల్లో క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది. కృష్ణానది పరిధిలోని అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు మూసి వేశారు. జూరాల, శ్రీశైలం, సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి, కాలువలకు సాగునీటి పంపిణీ కొనసాగుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు వద్ద గేట్లు మూస్తున్న క్రమంలో 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయిన ఘటన నేపథ్యంలో తిరిగి గేటు బిగించేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాజెక్టులోని నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. దీంతో నిండుగా కళకళలాడిన ప్రాజెక్టు శుక్రవారం నాటికి 72 టీఎంసీలకు పడిపోయింది.
తాత్కాలిక గేటును బిగించేందుకు పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి గేటు బిగించేందుకు గాను అడ్డుగా ఉన్న స్కైవాక్ ను భారీ క్రేన్ల సాయంతో తొలగించారు. నాగార్జున సాగర్ నాలుగు క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి 80 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తంలో అవుట్ ఫ్లో కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ( 312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో స్థిరంగా కొనసాగుతున్నది. సాగర్ నుంచి ఇన్‌ఫ్లో వస్తుండ డంతో పులిచింతల నీటిమట్టం పెరిగింది.
