calender_icon.png 6 May, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చలు సఫలం..ఆర్టీసీ సమ్మె వాయిదా

06-05-2025 06:56:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడ్డింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) మంగళవారం జరిపిన చర్చలు విజయవంతం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిత్తల్, లోకేశ్ కుమార్, కృష్ణ భాస్కర్ లతో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారంపై వారం రోజుల్లోగా నివేదిక అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 

ఇదిలా ఉండగా...  దాదాపు మూడు గంటల పాటు రవాణా మంత్రి పొన్నంతో జేఏసీ నాయకుల చర్చలు కొనసాగాయి. ఈ చర్యల్లో ఆర్టీసీ విలీనం అంశంపై సుదీర్గంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ... ఉద్యోగ భద్రత, కారుణ్య నియమకాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. సింగరేణి మాదిరిగానే రెగ్యులర్ ప్రాతిపదికన కరుణ్య నియామకాలు చేపట్టాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, వేతన సవరణ గురించి చర్చించినట్లు వారు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చేలా సమ్మెను కొంతకాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

అంతకుముందు, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖను విడుదల చేసింది. సంస్థను కాపాడుకోవడానికి సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ మద్దతుతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం తన నిబద్ధతను నొక్కి చెప్పింది, సవాలుతో కూడిన కాలం తర్వాత కార్పొరేషన్ పునరుద్ధరణ ప్రయత్నాలను వెల్లడించింది. టీజీఎస్ఆర్టీసీని సంక్షోభంలోకి నెట్టివేసిన 2019 సమ్మెను కూడా ప్రస్తావించింది. అంతరాయం కలిగించాలని సూచించే సమూహాల ప్రభావం నుండి బయటపడాలని ఆర్టీసీ ఉద్యోగులను హెచ్చరించింది.