06-05-2025 05:32:26 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఓబుళాపురం మైనింగ్ కేసులో 14 ఏళ్ల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించింది. మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో సహా ఐదుగురిని దోషులుగా, ఇద్దురిని నిర్దోషులుగా సీబీఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి (ఓఎంసీ డైరెక్టర్),ఏ2 గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్(గనులశాఖ డైరెక్టర్), ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 కె.మెఫజ్ అలీఖాన్ లను(గాలి జనార్ధన్ రెడ్డి పీఏ) దోషులుగా తేల్చిన కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 ఐఏఎస్ శ్రీలక్ష్మిని (పరిశ్రమలశాఖ కార్యదర్శి) 2022లోనే కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసింది.
ఏ8 విశ్రాంత ఐఏఎస్ కృపానందంను, 2004-2009 మధ్య గనుల మంత్రిగా పనిచేసినా ఏ9 సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే, దోషులకు రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ, ఈ కేసులో దోషిగా తేలిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ తిర్పు వెల్లడించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ గా పని చేసిన ఏ3 వీడీ రాజగోపాల్ కు అదనంగా మరో నాలుగేళ్లు విధించింది. ప్రభూత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందుకు అందరితో పాటు ఏడేళ్లు, అదనంగా విధించిన శిక్షతో కలిపి మొత్తంగా 11 ఏళ్లు అతడికి సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది.