06-05-2025 11:49:21 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకంపై ఆయా శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్లను సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి ఈ నెల 20 తేదీలోగా జిల్లా స్థాయి కమిటీకి పంపించాలని సూచించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న యూనిట్లను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలనకు బ్యాంకులు వేగంగా స్పందించాలని, రోజువారి నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ద్వారా లక్ష్యాలను సాధించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అనంతరం మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు, ఇప్పటి వరకు వాటి పరిశీలన స్థితి, బ్యాంకులవారీగా టార్గెట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఎల్.డి.ఎం రాంగోపాల్, మండలాల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు. ఎంపిడిఓలు, వివిధ బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.