‘అమీర్ లోగ్’ సౌండ్ నైజాం నుంచి అన్ని వుడ్‌లకు..
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవిరెడ్డి సోమ నిర్మించిన తొలిచిత్రం ‘అమీర్ లోగ్’. ఈ చిత్రానికి రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్‌రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు.
రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ సినిమాను తెలుగులో ఆగస్టు 21న రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు రమణారెడ్డి సోమ మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ సినిమా ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ. ఇప్పటివరకు ఇలాంటి చిత్రం రాలేదు. మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర రావడం లేదంటుంటారు కదా.. ఇకపై హైదరాబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్టు 21న నైజాంలో ప్రారంభమయ్యే సౌండ్.. అన్ని వుడ్లకు చేరుకుంటుంది” అన్నారు.
నిర్మాత మాధవిరెడ్డి సోమ మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ సినిమాను మా దర్శక నిర్మాత అందమైన పెయింటింగ్‌గా తీర్చిదిద్దారు. సినిమా చూసి వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకువెళ్తారు” అని తెలిపారు. ‘ప్రీమియర్లు వేసిన ప్రతీ చోటా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి’ అని నటుడు ఎంసీ హరి తెలిపారు. నటుడు మనోజ్ మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ లాంటి సినిమాతో మేం ఇంకో పదేళ్లు కొనసాగుతాం. తెలంగాణను రిప్రజెంట్ చేసేలా మా చిత్రం ఉంటుంది” అని చెప్పారు.
నటి వేద జలంధర్ మాట్లాడుతూ.. “అమీర్ లోగ్’ ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. మా కరీంనగర్‌లో సినిమా చూసిన వారంతా నా గురించే అడిగారట (నవ్వుతూ). మా చిత్రంలో నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. మా సినిమాలో అన్నిరకాల ఎమోషన్స్ ఉంటాయి. చిత్రాన్ని చూసిన తర్వాత ఫుల్ మీల్స్ తిన్నట్టుగా, కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది” అని తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ రోహిత్, కో ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి, నటుడు యోగి కూడా మాట్లాడారు.






