తెలంగాణ సమస్యల బాధ్యత బీజేపీదే
జూకంటి జగన్నాథం :
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, పార్లమెంట్, శాసనసభ్యులకు మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ఆరోపణ లు, ప్రత్యారోపణల దృష్ట్యా తెలంగాణ కవి, రచయిత జూకంటి జగన్నాథం బీజేపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని, పార్టీలకతీతంగా రాష్ట్రాభివృద్ధిని బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ యథాతథంగా...
గౌరవనీయులు బీజేపీ కేంద్ర మంత్రి వర్యులు, పార్లమెంట్, శాసనసభ్యులకు నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, మీకు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాద వివాదాలను గమనంలోకి తీసుకొని, ఒక కవిగా, తెలంగాణవాదిగా ఈ కింది అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాను. ఇరుపక్షాలు సహృదయతతో ఆలోచిస్తాయని భావిస్తున్నాను.
తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో 8 సీట్లను బీజేపీకి ప్రజలు కట్టబెట్టారు. తద్వారా సగం వరకు శాసనసభ స్థానాల పరిధిలో పరోక్షంగాను, ప్రత్యక్షంగాను మునుపెన్నడూ లేనంతగా బీజేపీ బలం పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ పాలన విషయంలో కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి విలేకరుల సమావేశంలోనూ, బహిరంగ లేఖ ద్వారా మీ సహకారాన్ని పదేపదే కోరిన, కోరుతున్న విషయం ప్రజాప్రతినిధులైన మీకు విదితమే!
తెలంగాణలో రానున్న ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరేయాలని కేంద్ర ప్రభుత్వం తపన పడుతున్నది. కానీ, కేంద్రంలోని అధికార పార్టీ అధినాయకులపై తెలంగాణలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం కావలసినంత ఒత్తిడి పెంచడం లేదు. తెలంగాణ సీఎం ఆ వేదనతో మిమ్మల్ని కలిసనప్పుడు పత్రికల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.. ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమైనట్టు కనబడుతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో మీ వంతు సహకారం అందించిన విషయం తెలంగాణ సామాన్య సమాజానికి సైతం అవగతమే. ఈ విషయాన్ని మరిచి ప్రధానమంత్రి పదే పదే ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అవుతుందో, ఎంతవర కు ప్రాసంగికత ఉంటుందో మీరే చెప్పాలి.
ఈ అంశం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న మిమ్మల్ని, అంటే తెలంగాణ బీజేపీ నాయకులు, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులను ఒక విధంగా బోనులో నిలబెడుతున్నదనేది తమకు తెలియనిది కాదు. బలమైన నాయకుడు కేంద్రంలో పాలన చేస్తున్నప్పుడు మీకు కొన్ని పరిధిలు, పరిమితులు ఉంటాయన్న విషయం తెలంగాణ మేధావి వర్గానికి తెలు సు. అయినప్పటికీ, క్లోజ్ ది డోర్స్‌లోనైనా మీరు నకారాత్మక అంశాన్ని, తెలంగాణ సమాజం మంచి చెడ్డలను మీ నాయకుని దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణకు చెందిన సమస్యలు, కేంద్రం పరిష్కరించవలసిన వివిధ శాఖలలో అపరిష్కృతంగా పేరుకుపోయిన పనులను పరిష్కారం దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలంగాణ నుంచి ఎన్నికైన మీపై తప్పకుండా ఉం టుంది. తెలంగాణ ప్రయోజనాలే ప్రధానం గా మీరు, మీ సహచరులు పనిచేస్తేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ తగిన సహకారం అందిస్తేనే మీకూ, మీ పార్టీకి తెలంగాణ ప్రజ ల్లో ఎన్నదగిన గుర్తింపు కలుగుతుంది. కేంద్రం నెరవేర్చవలసిన హామీలు, సమస్యల పరిష్కారం పట్ల మీరు మోకాలడ్డు పెట్టకపోవ చ్చు. కానీ, తగిన సమయంలో సమస్యలు కొలిక్కిరాకపోతే జాగరూకమైన తెలంగాణ ప్రజలు ఆ విధంగా అనుకునే అవకాశాలకు మీరే ఊతమిచ్చినట్టు అవుతుంది. దానివల్ల సమీపంలో మీ ఉనికికి తెలంగాణలో ప్రమా దం కూడా పొంచి ఉంటుది.
ఇక ఎంతకాలం హిందువుల పేరిట ఓట్ల ను రాబట్టలేకపోవచ్చు. మొదటినుంచీ, ముఖ్యంగా తెలంగాణ నేల స్వభావం ఉద్యమాల చరిత్రతో కూడుకున్నదనే విషయాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ ప్రధానమైన విష యం. తుఫాను ముందు నిశ్శబ్దంగా ఉండే సముద్రంలా తెలంగాణ సమాజం పైకి నిశ్శబ్దంగానే ఉంటుంది.
తెలంగాణలో ఎప్పుడు, ఏ దిశగా, ఏ విధంగా సుడిగుండాలు, తుఫా న్లు చెలరేగుతాయో ఊహించడం అత్యంత క్లిష్టమైన సమస్య. ఊహకందని దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటేగానీ అధికారం దరిదాపుల్లోకి పోవడానికి మార్గం సుగమం అవుతుంది. అంతేతప్ప పార్లమెంటు సభ్యులలో ఒకరికొకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా గోతులు తవ్వుకుంటూపోతే అసలుకే మోసం వస్తుంది. భవిష్యత్తులో కుక్క తోక వంకరలా అలాగే ప్రవర్తిస్తే ఆశాజనకంగా ఉండే అవకాశం దీపం కొడిగట్టిపోతుంది.
పక్కరాష్ట్ర అధికార పార్టీ కేంద్రం నుంచి నిధులు, విధులు రాబట్టుకుంటున్న విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ, తెలంగాణ ప్రజల కోసం పని చేయాల్సిన మీరందరూ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
బీసీ ముఖ్యమంత్రి, కులజనగణన లాంటివి నినాదాలుగా మిగిలిపోతాయి. ఆచరణలో అమలయ్యేలా చూడాల్సిన బాధ్య త బీజేపీ నాయకులపై ఉన్నది. తమ తమ విలువలను, వ్యక్తిత్వాలను, రీతులను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తేవడం అసందర్భం కాదనుకుంటాను. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలకు అవినీతి, ఆరోపణల కేసులను అప్పజెప్పాలని మీరు తరచుగా డిమాండ్ చేశారు. తీరా కేసులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ఒక్క అడు గు ముందుకు పడకపోవడం గమనార్హం. వీటన్నింటిని కూడా తెలంగాణ మేధావి వర్గం పరిగణనలోకి తీసుకొని మసులుకుంటుంది. సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం కూడా నిస్సందేహంగా చెబుతుంది.
తెలంగాణ ప్రజల మట్టి, ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం సరైన సమయంలో, సరైన చర్యలు తీసుకోవాలి. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని తెలంగాణ సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తే భవిష్యత్తు తెలంగాణలో కాషాయ జెండాకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇవన్నీ కాదు గాని, ఒక మాటలో చెప్పాలంటే ‘ఎరుకకు నడికే సాక్షి’ అనే తెలంగాణ సామెతను నిజం చేయాల్సిన పని తెలంగాణ బీజేపీ మంత్రులు, పార్లమెంట్, శాసనసభ్యులు, నాయకుల భుజస్కందాలపై నిస్సందేహంగా ఉన్నది. ప్రస్తుతం బంతి బీజేపీ కోర్టులో ఉన్నది. ఎదుటి పక్షంపై గోల్‌గా మలుస్తారో, సెల్ఫ్ గోల్ చేసుకుంటారో? చూడాలి.
కవి, రచయిత






