08-07-2025 12:00:00 AM
విద్యార్థులపై బ్యాగు భారం అనే సంస్కృతి కొనసాగుతూనే ఉంది. నర్సరీ పిల్లల స్కూల్ బ్యాగు కూడా బరువు కిలోలకు కిలోలు ఉండడం బాధాకరం. ఆడుతూ.. పాడుతూ బడికి వెళ్లాల్సిన పిల్లలు తమ వీపులపై బ్యాగులు మోసంకుంటూ భారంగా వెళ్తున్నారు. స్కూలు యాజమాన్యాలు అవసరం ఉన్నా..లేకున్నా.. తల్లిదండ్రులతో పుస్తకాలు కొనిపించి, పిల్లలపై భారం మోపుతున్నాయి.
బ్యాగులు మోసి కొందరు పిల్లలు 15 ఏళ్లు నిండక ముందే నడుము, మెడనొప్పి, కండరాల సమస్యల బారిన పడుతున్నారు. ఏళ్ల తరబడి బరువైన బ్యాగులు మోయడం వల్ల యుక్త వయస్సు వచ్చేసరికి భుజాలు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. పిల్లలు బ్యాగులు మోసుకుంటూ వచ్చి సాయంత్రం అలసటకు గురవుతున్నారు. పిల్లలకు పుస్తకాలతో పెద్దగా పనిలేకుండా ఉండే విద్యావిధానం ఉండాలి.
ఈ విషయంలో పాఠశాల యాజమాన్యాలు, అధికారులు , తల్లిదండ్రులు చొరవ చూపాలని డాక్టర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. మోయాల్సిన బరువు కంటే పిల్లలు అధిక బరువు మోయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై బుక్స్ భారం తగ్గించాలని విద్యాహక్కు చట్టం చెప్తున్నప్పటికీ.. ప్రైవేటు విద్యాసంస్థలు ఆ నిబంధనలను పట్టించుకున్న పాపన్న పోలేదు.
పిల్లలపై పుస్తకాల భారం తగ్గించాలని 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. కానీ, అమలుకు మాత్రం నోచుకోలేదు. 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రతి నెలా ఒకటో, మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలని యాజమాన్యాలను ఆదేశించింది. అది కూడా ఎక్కడా అమలకు నోచుకువడం లేదు. బడి సంచుల బరువుపై విద్యాశాఖ యంత్రాంగం నిరంతర నిఘా, పర్యవేక్షణ కొనసాగాలి.
నిర్లక్ష్యంగా వ్యవహరించే పాఠశాలల యాజమాన్యాలపై అధికారులు తగిన చర్యలు తీసుకురావాలి. పిల్లల తల్లిదండ్రుల వైఖరి కూడా మారాలి. ఎక్కువ పుస్తకాలు ఇచ్చే పాఠశాలల్లోనే మంచి విద్య అందుతుందనే భ్రమ నుంచి బయటపడాలి. యాజమాన్యాలు కూడా విద్యార్థులకు ఎంత మేరకు పుస్తకాలు అవసరమో.. అంతవరకే తల్లిదండ్రులతో కొనిపించాలి.
లకావత్ చిరంజీవి, హైదరాబాద్