calender_icon.png 14 July, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్మరులను బీసీ ‘ఏ’లో చేర్చాలి

08-07-2025 12:00:00 AM

‘మానవ నాగరికతకు కుమ్మరి తొలి మెట్టు. ఆరోగ్యానికి కుండ ఆయువు పట్టు’ అనేది నానుడి. మానవుడికి వంట నేర్పి మానవ చరిత్ర కుమ్మరులది. మానవాళి వంట వండేందుకు వంట పాత్రలు సమకూర్చి, మానవ జాతి అభివృద్ధికి దోహదప డిన జాతి. మనిషి పుట్టుక, పెళ్లి, చావు.. ఇలా కార్యమేదైనా కుండలు ఉపయోగించడం సహజం. ఇక దైవ కార్యక్రమాల్లోనూ కుమ్మరుల ఉత్పత్తులైన కుండలకు ప్రత్యేక స్థానం ఉంది.

నీటి నిల్వకు తొట్లు, రంజ న్లు.. పెళ్లి వేడుకలో ‘ఐరేని  కుండలు’ తరతరాలుగా వినియోగిస్తూ వస్తున్నాం. కుమ్మరి వృత్తి మానవ జాతి మనుగడలో ప్రధాన పాత్ర పోషించిందనడంలో ఎలాం టి అతిశయోక్తిలేదు. ‘మొహంజోదారో’, ‘హరప్పా’, ‘మెసపటోనియా’, ‘సింధూ’ నాగరికతల కాలంలోనూ విలసిల్లింది. గృహప్రవేశం, ప్రభుత్వ భవనాల భూమిపూజ, అమ్మవారి బోనం ఇలా శుభకార్య మేదైనా కుండలను ఉపయోగిస్తున్నాం.

మట్టిని నమ్ముకుని పర్యావరణ పరిరక్షణ కు కవచంగా నిలిచిన కుమ్మరి వృత్తి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. కుమ్మరి వృత్తి వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరాదరణకు గురై అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కుల వృత్తుల (మట్టి పాత్రలకు) ఉత్పత్తులకు గిరాకీ తగ్గడం వల్ల కుల వృత్తిపై ఆధారపడిన కుమ్మరులు ఆ వృత్తిని వదిలి పట్టణాలకు వలస పోతున్నారు.

అల్పవేతనాలకు పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా 14 లక్షల మంది కు మ్మరులు ఉండగా, వీరిలో 8 లక్షల మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కుమ్మరులను మద్ద తునిచ్చారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం మాత్రమే కాదు.. తెలంగాణ ఉద్యమంలో కూడా వీరు క్రియాశీల పాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధనలోనూ భాగస్వాములయ్యారు.

సక ల జనుల సమ్మె, మిలియన్ మార్చ్‌లో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. చాలామంది కుమ్మరులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ కార్యవర్గంలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. గత ప్రభుత్వం కుమ్మరులను పెద్దగా పట్టించుకోలేదు. చట్టసభల్లో నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కనీసం నామినేటెడ్ పదవులు ఇస్తుందనుకుంటే అది నెరవేరలేదు.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక స్థోమత లేని కుమ్మరి నేతలు, నామినేటెడ్  పదవుల్లో అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కుమ్మర్లకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పించకపోవడం వల్ల రాజ్యాధికారంలో వాటా దక్క డం లేదు. కుమ్మరులను బీసీ ‘బీ’ జాబితాలో చేర్చినప్పటికీ ఆశించిన విధంగా వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసం జరగలేదు.

సీఎం స్పందించాలి..

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన ద్వారా నైనా కుమ్మరులను బీసీ ‘ఏ’లో చేర్చాలి. ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగ పరం గా, రాజకీయంగా వెనుకబడిన ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి. కుమ్మరి కులస్తుల జీవితాల్లో వెలుగులు నింపాలి. కుమ్మరుల్లో ఇప్పటివరకు ఏ ఒక్కరికీ నేటి వరకు అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ, కౌన్సిల్ సభ్యులుగా అవకాశం ఇచ్చింది లేదు.

ఉత్తరాది రాష్ట్రాల్లో కుమ్మరులను ప్రజాపతి, కుమార్, కుంభార్, కుమావత్, కుంభాకార్ అనే పేర్లతో పిలుస్తారు. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. ఒకే చట్టం.. ఒకే రిజర్వేషన్ అని చెబుతూ.. ఉత్త ర, దక్షిణ ప్రాంతాల మధ్య వివక్ష చూపడం వల్ల కుమ్మరులు చట్టసభల్లో ప్రవేశానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, పార్టీలు అవలంబిస్తున్న వైఖరి కూడా కుమ్మరుల పాలిట శాపంగా మారుతోంది. ‘ఎమ్మెల్సీ’ ‘కార్పొరేషన్స్ చైర్మన్ పదవుల్లో నామినేట్ చేయకపోవడం వల్ల రాజ్యాధికారం కుమ్మరులకు అందని ద్రాక్షగానే మిగిలింది. 

కుమ్మరుల వలసలు.. 

కుమ్మరి వృత్తి ఉత్పత్తులైన కుండలు, వంట పాత్రలకు మార్కెట్లో డిమాండ్ భారీ గా తగ్గింది. కుమ్మరి వృత్తి కూడు పెట్టని స్థితికి చేరింది. ఈ పరిస్థితి కుమ్మరి వృత్తిదారులు కుల వృత్తిని వదిలి పట్టణాలు, నగరాలకు వలస వెళ్లేందుకు కారణమైంది. మన దేశంలోని పట్టణాలకు మాత్రమే కాకుండా.. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకూ వలస వెళ్తున్నారు. ప్లాస్టిక్, అల్యూమిని యం పాత్రలు మార్కెట్‌లో విరివిగా లభించడం వల్ల కుండల్లో వంటలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గింది.

వంట చేసుకునే మట్టి పాత్రలకు డిమాండ్ తగ్గడంతో కుమ్మరులు భారీగా నష్టపోయారు. కుండ లు, వంట పాత్రలకు ముడి సరుకుగా ఉపయోగించే మట్టి కొరత ఓ వైపు, మార్కెట్లో డిమాండ్ తగ్గి గిరాకీ లేకపోవడం మరోవైపు వెరసి కుమ్మరులు ఆర్థికంగా కుదేల య్యారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కుమ్మరులు ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉండడం వల్ల వారి కి అనేక రాజకీయ అవకాశాలు వచ్చాయి.

అనేక మంది శాసనసభ్యులుగా, ఎంపీలు గా, శాసన మండలి సభ్యులుగా, మంత్రులుగా రాణిస్తున్నారు. కుమ్మరి కులంలోని యువతలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి. ప్రతి మండల, జిల్లా కేంద్రంలో అధునాతన పాటరీ ‘కలంకారీ’ ఉత్పత్తి కేం ద్రాలను ఏర్పాటు చేయాలి. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. కుమ్మరి వృత్తి అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించాలి.

వాము బట్టీల కొరకు ఉచితంగా స్థలం సమకూర్చాలి. మట్టి సేకరణ, వాము కాల్చేందుకు పొరక, అడవి నుంచి కలప ఉచితంగా పొందే విధంతా జీవో తేవాలి. వాము, కుండల బట్టీ, షెడ్ నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయించాలి.  చాకలి, మంగలి వృత్తుల కు ఇస్తున్నట్లుగానే కుమ్మరి ఆవాసాలకు ఉచితంగా విద్యుత్ అందించాలి. కుమ్మరులకు పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సి పల్ కార్పొరేషన్లలోని షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఉచిత వసతి కల్పించాలి.

కుమ్మర్ల ఉత్పత్తులకు రైతు బజార్లలో స్టోరేజ్ సౌక ర్యం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. పాటరీ కోర్స్‌ను విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా చేర్చాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈపీఎఫ్‌వో కింద ఇన్సురెన్స్, ఆరోగ్య, ప్రమాద బీమా సౌక ర్యం కల్పించాలి. కుమ్మరి వృత్తిదారులకు ఉచితంగా లేబర్ గుర్తింపు కార్డులు, ఆరో గ్య కార్డులను కార్మిక మంత్రిత్వ శాఖ మం జూరు చేయాలి. ప్రభుత్వం ఎండోమెంట్స్‌శాఖ ద్వారా కుమ్మరి కులస్తులను గ్రామ దేవతల అలయాల్లో పూజారులుగా నియమించాలి.

పెన్ష్షన్ అందజేయాలి

కుమ్మరి వృత్తిదారులకు పెన్షన్ సౌక ర్యం కల్పించాలి. ప్రమాద బీమాపథకాన్ని, ఉచిత ఆరోగ్య పథకాన్ని వర్తింపజేయాలి. విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి. రాష్ర్ట ప్రభు త్వం కుమ్మర్ల సమగ్రాభివృద్ధ్దికి, ఆర్థిక వికాసానికి, వృత్తి నైపుణ్య అభివృద్ధికి దోహదపడే కుమ్మరి శాలివాహన ఫైనాన్స్ ఫెడరేషన్‌కు రూ.2 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. కుమ్మరి శాలివాహన ఫైనాన్స్ ఫెడరేషన్‌ను పునరుద్ధరించాలి. అన్ని జిల్లాలకు పాలక వర్గాలను నియమించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో కుమ్మరులకు అవకాశం కల్పించాలి. వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలి.

 వ్యాసకర్త సెల్: 9440245771